Iron-Rich Foods: ఆరోగ్యకరమైన జీవితానికి హిమోగ్లోబిన్ చాలా అవసరం. శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. హిమోగ్లోబిన్ లోపం వల్ల రక్తహీనత (అనీమియా) ఏర్పడుతుంది. దీనివల్ల అలసట, బలహీనత, తలనొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించడానికి సహాయపడే టాప్ 10 ఐరన్-రిచ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బచ్చలికూర : బచ్చలికూర ఐరన్‌కు గొప్ప మూలం. దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఐరన్‌ను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. దీనిని సలాడ్‌లు, కూరలు, స్మూతీల రూపంలో కూడా తీసుకోవచ్చు.
ఖర్జూరాలు: ఖర్జూరాలలో ఐరన్‌తో పాటు, విటమిన్ సి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. ప్రతిరోజూ కొన్ని ఖర్జూరాలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలేట్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అందుకే బీట్‌రూట్ జ్యూస్ లేదా సలాడ్‌గా తీసుకోవడం చాలా మంచిది.
కాయధాన్యాలు : కాయధాన్యాలు, ముఖ్యంగా పప్పు ధాన్యాలు ఐరన్‌కు అద్భుతమైన వనరులు. ఒక కప్పు ఉడికించిన ధాన్యాలలో చాలా ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇవి శాకాహారులకు చాలా బాగా ఉపయోగపడతాయి.
శనగలు : శనగలలో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా హిమోగ్లోబిన్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. శనగలను సలాడ్‌లు, కూరలు లేదా గుగ్గిళ్లుగా తీసుకోవచ్చు.
పప్పు ధాన్యాలు : వివిధ రకాల పప్పు ధాన్యాలు ఐరన్‌తో నిండి ఉంటాయి. ముఖ్యంగా కందులు, పెసలు, మసూర్ పప్పులలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా సులభం.
గుమ్మడి గింజలు : ఈ చిన్న గింజలలో ఐరన్, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు లేదా సలాడ్‌లు, పెరుగులో కలిపి తీసుకున్న కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఉలవలు : ఉలవలు ఐరన్‌కు ఒక శక్తివంతమైన మూలం. భారతదేశంలో ఇది సాంప్రదాయ ఆహారంగా చాలా కాలంగా వాడుకలో ఉంది. వీటిని ఉలవచారు లేదా పప్పుగా వండుకోవచ్చు.
Also Read: రోజుకో టమాటో తింటే.. ఇన్ని లాభాలా ?
నల్ల నువ్వులు : నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని లడ్డూలు, చిక్కీలు రూపంలో తీసుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్‌లో ఐరన్‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 70% కంటే ఎక్కువ కోకో శాతం ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది.
ఈ ఆహారాలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లోపాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే.. శరీరం ఐరన్ గ్రహించే శక్తిని పెంచడానికి విటమిన్ సి ఉన్న ఆహారాలను (నిమ్మకాయ, నారింజ, ఉసిరి వంటివి) తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే.. విటమిన్ సి ఐరన్ శోషణకు చాలా అవసరం. మంచి ఆహారపు అలవాట్లతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఆరోగ్యానికి ముఖ్యమైనది.