Cockroach: సాధారణంగా ఇళ్లలో మహిళలు ఎదుర్కునే సమస్యలలో ఒకటి బొద్దింకల సమస్య. ఇవి ఆహార పదార్థాలను పాడుచేయడమే కాకుండా, ఇంట్లోని దుస్తులను కూడా మురికిగా మారుస్తాయి. అంతే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే ఇంట్లో, ముఖ్యంగా వంటింట్లో నుండి బొద్దింకలను తరిమి కొట్టడం చాలా ముఖ్యం. మీ ఇంట్లో కూడా బొద్దింకలు ఉంటే, వాటిని వదిలించుకోవడానికి మీరు కొన్ని సహజమైన, ప్రభావ వంతమైన పద్ధతులను ఉపయోగించవచ్చు. మరి ఎలాంటి హోం రెమెడీస్ బొద్దింకలను తొలగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బోరిక్ పౌడర్, చక్కెర :
బోరిక్ పౌడర్- 1 టీ స్పూన్
చక్కెర – 1 టీ స్పూన్
ఎలా వాడాలి ?
బోరిక్ పౌడర్ , చక్కెరను సమాన పరిమాణంలో కలిపి, బొద్దింకలు తరచుగా వచ్చే దారులు , మూలల్లో చల్లుకోండి. దీనిలో ఉండే చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది. అంతే కాకుండా బోరిక్ పౌడర్ వాటిని చంపుతుంది. ఇది పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలని గుర్తుంచుకోండి.
బేకింగ్ సోడా, చక్కెర:
కావాల్సినవి:
బేకింగ్ సోడా- 1 టీ స్పూన్
చక్కెర- 1 టీ స్పూన్
బొద్దింకలను వదిలించడానికి బేకింగ్ పౌడర్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, బేకింగ్ సోడా , చక్కెరను సమాన మోతాదులో తీసుకుని మిక్స్ చేయాలి. తర్వాత దీనిని బొద్దింకలు వచ్చే ప్రదేశాలలో చల్లుకోండి. ఈ మిశ్రమం బొద్దింకల ప్రేగులలో వాయువును ఉత్పత్తి చేయడం ద్వారా వాటిని చంపుతుంది.
ఉల్లిపాయ:
వెల్లుల్లి, ఉల్లిపాయ, ఎర్ర మిరపకాయల పేస్ట్ తయారు చేసి నీటిలో మరిగించాలి. ఈ మిశ్రమం చల్లబడిన తర్వాత, దానిని స్ప్రే బాటిల్‌లో వేసి ఇంటి మూలల్లో , బొద్దింకలు వచ్చే ప్రాంతాల్లో స్ప్రే చేయండి. ఈ మిశ్రమం యొక్క ఘాటైన వాసన ఇంటి నుండి బొద్దింకలను తరిమివేస్తుంది.
వేప నూనె, వేప పొడి:
బొద్దింకలకు వేప నూనె లేదా పొడి విషపూరితంగా పరిగణించబడుతుంది. దీన్ని నీటితో కలిపి స్ప్రే తయారు చేసి, బొద్దింకలు కనిపించే ప్రదేశాలలో పిచికారీ చేయాలి. వేప నూనె ఒక సహజ పురుగుమందు. అంతే కాకుండా ఇది పర్యావరణానికి చాలా సురక్షితమైనది కూడా.
బిర్యాణి ఆకు:
బిర్యాణి ఆకుల ఘాటైన వాసన బొద్దింకలను తరిమివేస్తుంది. ఇంట్లోని వివిధ మూలల్లో, ముఖ్యంగా బొద్దింకలు తరచుగా కనిపించే ప్రదేశాలలో కొన్ని బిర్యాణి ఆకులను ఉంచండి. ఇది బొద్దింకలను తరిమికొట్టడానికి సహాయపడుతుంది.
Also Read: ఉదయం పూట తినాల్సినవి, అస్సలు తినకూడనివి ఇవే ?
పరిశుభ్రత:
బొద్దింకలను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఇంటిని శుభ్రంగా, జాగ్రత్తగా చూసుకోవడం. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్ శుభ్రంగా ఉంచండం వల్ల చాలా వరకు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా ఇంట్లో ఆహారం, ధూళి ఉన్నా కూడా బొద్దింకలు ఎక్కువగా వస్తుంటాయి. చెత్తబుట్టను కూడా మూసి ఉంచండి. క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.
ఈ పద్ధతులను ప్రయత్నించడం ద్వారా బొద్దింకలను చాలా వరకు తొలగించవచ్చు. మీరు బొద్దింకలతో ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా వీటిని ఒకసారి ప్రయత్నించండి.