High Selenium Wheat Baldness| మహారాష్ట్రలోని బుల్ధానా పరిసర ప్రాంతాలో గత ఏడాది డిసెంబర్‌లో ఒక వింత వ్యాధి ప్రబలింది. ఈ వ్యాధి కారణంగా పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అకస్మాత్తుగా జుట్టు రాలిపోయే సమస్య ఎదురైంది. ఈ సంఘటన వల్ల ప్రజల్లో కలకలం రేగింది. కేవలం రెండు నెలల్లోనే 18 గ్రామాల్లో దాదాపు 300 మందికి జుట్టు ఊడిపోయింది. దీంతో అక్కడ ఈ వ్యాధి మూల కారణం తెలుసుకునేందుకు ప్రభుత్వం తరపున నిపుణుల రంగంలోకి దిగారు. అక్కడి చుట్టు పక్కల నీరు, ఆహార నమూనాలకు సేకరించి పరీక్షలు జరిపారు. ఈ కేసుకు సంబంధించిన వైద్య నివేదిక మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అక్కడ ప్రజలు తినే ఆహారంలోనే సమస్య ఉందని తేలింది. ఆ ప్రాంతంలోని ప్రజలు ఆహారంగా వినియోగించే గోధుమలలో సెలీనియం స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరిగిందని నివేదికలో తేల్చారు.
సెలీనియం అధిక స్థాయి ఉండడమే కారణం
ప్రాథమిక నివేదికల ప్రకారం, పంజాబ్ మరియు హర్యానా నుంచి వచ్చిన గోధుమల్లో సెలీనియం స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఇదే ప్రజల జుట్టు రాలడానికి ప్రధాన కారణమని నివేదికలో పేర్కొన్నారు. ఈ గోధుమలలో సెలీనియం అధిక మోతాదులో ఉందని పరిశోధనలో తేలింది. బుల్ధానా ప్రాంతంలోని స్థానిక ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్న.. గోధుమలు పంజాబ్, హర్యానా నుంచి వచ్చాయని తేలింది. ఈ గోధుమలను మహారాష్ట్రలోని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో స్థానికంగా పండించిన గోధుమల కంటే పంజాబ్ మరియు హర్యానాలో పండించిన గోధుమలలో 600 రెట్లు ఎక్కువ సెలీనియం ఉందని పరిశోధనలో తేలింది.
Also Read: రక్త పరీక్షతో మీరు ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.. ఎలాగంటే..
నెల రోజులపాటు జరిగిన ఈ పరీక్షలు పద్మ శ్రీ డాక్టర్ హిమ్మత్ రావు బవాస్కర్ నేతృత్వంలో జరిగాయి. దీని గురించి డాక్టర్ బవాస్కర్ మాట్లాడుతూ.. “బుల్ధానా సమీపంలోని మొత్తం 18 గ్రామాల్లో ఈ సమస్య గుర్తించాం. ఇక్కడి ప్రజలు తినే గోధమల్లో జింక్ చాలా తక్కువగా ఉండడం, సెలేనియం ఆశ్చర్యకరంగా 600 రెట్లు ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. సెలీనియం అంత ఎక్కువ మోతాదు మానవ శరీరంలో ఉంటే అలోపేసియా సమస్య వస్తుంది. ఈ ఆహారం తిన్న వెంటనే అంటే మూడు నుంచి నాలుగు రోజుల్లోనే జుట్టురాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 8 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసు గల గ్రామస్తులందరూ బట్టతల సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యతో వారంతా సమాజంలో హేళనకు గురవుతారనే భయంతో పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. చాలామంది వివాహం కావాల్సిన యువతీయువకులు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. బాధితుల రక్తం, మూత్రం, వెంట్రకల నమూనాలు సేకరించి పరీక్షలు చేశాం. థానెలోని వెర్నీ లాబోరేటరీలో బాధితులు తినే గోధుమలు పరీక్షించబడ్డాయి. ఈ గోధుమల్లో 14.52 mg/kg సెలీనియం గుర్తించాం. సాధారణంగా ఇది 1.9 mg/kg ఉండాలి” అని చెప్పారు.
ఈ అసాధారణ ఆరోగ్య సమస్యకు అసలు కారణాన్ని కనుగొనడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఇతర ఆహార పదార్థాలను కూడా పరీక్షిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి సమస్యలు తలెత్తలేదని ఆహార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
పంజాబ్ అతిపెద్ద గోధుమల సరఫరాదారు
భారత ఆహార సంస్థ (FCI) నిర్వహించే కేంద్ర నిల్వలకు పంజాబ్ అతిపెద్ద గోధుమల సరఫరాదారుగా ఉంది. ఆ తరువాత స్థానంలో హర్యానా, మధ్యప్రదేశ్ ఉన్నాయి. అయితే గత సీజన్‌లో పంజాబ్ రాష్ట్రం 128 లక్షల టన్నుల గోధుమలను ఎఫ్‌సిఐకి సరఫరా చేసింది. ఇది మొత్తం నిల్వలో దాదాపు 47% భాగం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న్ యోజన పథకం కింద ఈ గోధుమలను ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా ఉచితంగా రేషన్‌గా అందిస్తున్నారు.