గోదావరి నది చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ దొరికే అనేక రుచులు నోరూరించేస్తాయి. పసందైన విందు కావాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే. రాజమండ్రి ఎప్పుడైనా వెళితే కచ్చితంగా అక్కడ ఉండే ఫ్లోటింగ్ రెస్టారెంట్లో భోజనం చేశాకే రండి. అది ఒక మరచిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది.
గోదావరి జిల్లాలలు అందమైన గోదావరి నదికే కాదు… పసందైన రుచులకు కూడా కేరాఫ్ అడ్రస్. అందుకే ఏపీ టూరిజం శాఖ వెరైటీ వంటకాలను గోదావరి రుచులను ప్రజలకు అందించేందుకు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను గత ఏడాది ప్రారంభించింది.
ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఎక్కడ?
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఉమా మార్కండేయ స్వామి ఆలయం సమీపంలోనే లాంచీల రేవు ఉంది. అక్కడకు చేరుకుంటే చాలు… ఏపీ టూరిజం శాఖ వారి బోట్ల ద్వారా మీరు ఫ్లోటింగ్ రెస్టారెంట్ కు చేరుకోవచ్చ. ఇక్కడ మీకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి తినవచ్చు. అంతేకాదు కిట్టి పార్టీలు, మీ పిల్లల పుట్టినరోజు వేడుకలకు కూడా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ బుక్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీలను ఇందులో ఘనంగా నిర్వహించుకోవచ్చు. దీనికోసం మీరు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు ఉదయం పదిగంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. మీకు నచ్చిన సమయంలో వెళ్లి అక్కడ ఉన్న అనేక రకాల ఆహారాలను ఆర్డర్ చేసుకొని తినవచ్చు.
ఎంతమంది కూర్చోవచ్చు?
రెస్టారెంట్లో ఒకేసారి 170 మంది కూర్చునేలా సిట్టింగ్ సామర్థ్యం ఉంది. ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఇలా అన్ని రకాల వంటకాలు లభిస్తాయి. ముఖ్యంగా గోదావరిలో దొరికే టేస్టీ చేపలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన చేపను కోరితే చాలు… వేపుడుగా చేయించుకుని తినవచ్చు. అక్కడ ఉండే లైవ్ కిచెన్ లో వేడివేడిగా మీకు కావాల్సినవి వండి పెడతారు వంటగాళ్ళు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ వల్ల 70 మంది వరకు ఉపాధిని పొందారు. ఏడాదిలో 11 నెలల పాటు ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. కానీ ఒక నెలపాటు అంటే వర్షాకాలంలో వరదలు వచ్చే సమయంలో ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఒడ్డుకు తీసుకొచ్చి పెడతారు. ఇందులో ఉన్న ధరలు కూడా ఎక్కువేమీ కాదు. సాధారణ ప్రజలకు అందుబాటు ధరలోనే ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ లోని ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.