Ice cream scam: ఐస్ క్రీమ్.. పిల్లలకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. వేసవి వచ్చిందంటే చల్లటి ఐస్ క్రీం కోసం పరుగులు పెడతారు. కానీ మనం నమ్మి తింటున్న ఐస్ క్రీమ్‌లు నిజంగా శుద్ధమైనవేనా? అసలు వాటిలో ఏముంటుంది? ఎవరు తయారుచేస్తున్నారు? అనేక ప్రశ్నలు వెలువడుతున్నా, అవేమీ మనం పట్టించుకోవడం లేదు. ఇది నెమ్మదిగా ప్రాణాల మీదికి ప్రమాదాన్ని తెచ్చే మోసంగా మారిపోయిందన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి మన దేశంలో ఐస్ క్రీమ్ మోసం మామూలు విషయం కాదు. లేబుల్‌పై ఐస్ క్రీమ్ అని రాసి, లోపల క్రీమ్‌కు సంబంధం లేని పదార్థాలు నింపుతున్నారు. నిజమైన ఐస్ క్రీమ్ అంటే పాల నుండి తయారవుతుందనేది సత్యం. కానీ మార్కెట్‌లో లభ్యమవుతున్న చాలా బ్రాండ్లు పాలకు బదులు వెజిటబుల్ ఆయిల్స్, యూరియా, డిటర్జెంట్ వంటి హానికర రసాయనాలను కలుపుతున్నారట. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కోసం ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా చిన్న బ్రాండ్లు, స్ట్రీట్ కార్ట్‌లలో ఉండే ఐస్ క్రీమ్‌లు ఈ మోసానికి పాల్పడుతున్నాయన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.
ఈ తరహా ఐస్ క్రీమ్ తింటే పిల్లల ఆరోగ్యం ప్రభావితమవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తక్కువ నాణ్యత కలిగిన, కల్తీ పదార్థాలతో తయారైన ఐస్ క్రీమ్‌లు పిల్లల జీర్ణాశయంపై తీవ్రంగా ప్రభావం చూపుతాయి. తిన్న వెంటనే కొందరికి వాంతులు, పొత్తికడుపు నొప్పులు రావచ్చు. దీర్ఘకాలంగా తింటే మూత్రపిండాలు, కాలేయ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం, ఈ మోసపూరిత పదార్థాల్లో గ్లిసరిన్, ఇండస్ట్రియల్ ఫ్లేవర్ కిమికల్స్ వంటి విష పదార్థాలు ఉండే ప్రమాదం ఉందని సమాచారం.
కేవలం ఆహార భద్రతా సంస్థలు మాత్రం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే కానీ పరిస్థితి మారదు. ఇప్పటికైనా పిల్లలు తినే ఐస్ క్రీమ్ పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐస్ క్రీమ్ కొనేటప్పుడు లేబుల్‌ను ఖచ్చితంగా చదవాలి. దాంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్, మిల్క్ ఫ్యాట్ వంటి పదాలు ఉన్నాయా లేదా చూడాలి. వనస్పతి, వెజిటబుల్ ఆయిల్ అనే పదాలు ఉంటే దూరంగా ఉండాలి. మరోవైపు ఫ్రోజెన్ డెజర్ట్ అనే పేరుతో వచ్చే వాటిని అసలు ఐస్ క్రీమ్‌లా భావించకూడదు. అవి చీప్ రీప్లేస్‌మెంట్లేనని తెలుస్తోంది.
Also Read: Viral Ferrari video: రూ.4 కోట్ల ఫెరారీ కారును ఇంట్లో వేలాడదీశాడు.. చూస్తే మీరే షాకవుతారు!
పిల్లలకు ఇష్టంగా ఉండటం వల్ల తల్లిదండ్రులు పరిశీలించకుండా ఏదిపడితే అది కొనిపెడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలల వెలుపల ఉండే టపాసీ రంగుల ఐస్ క్రీమ్‌లు ఆకర్షణీయంగా కనిపించినా, అందులో హానికర రంగులు, రసాయనాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల అలెర్జీలు, చర్మవ్యాధులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.
ఇంతటి తీవ్రమైన సమస్యను ప్రభుత్వం, నిత్యావసర సరఫరాల శాఖ, ఆరోగ్య శాఖలు సీరియస్‌గా తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రత్యేకంగా చిన్న స్థాయి ఫ్యాక్టరీలపై తనిఖీలు నిర్వహించాలని, ఫుడ్స్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ బోర్డు తరచూ నమూనాలను సేకరించి పరీక్షించాలన్నది వారి డిమాండ్.
అంతేకాదు, ఇంట్లోనే సహజ పదార్థాలతో ఐస్ క్రీమ్‌లు తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. పాలతో, పండ్లతో, తేనెతో లేదా జాగ్రత్తగా ఎంచుకున్న సగం ప్రీమియం బ్రాండ్లతో స్వచ్ఛంగా తయారుచేయడం ఇప్పుడు చాలా ఈజీ. యూట్యూబ్, రీల్స్‌లో ఇంటి వంటలు చాలా అందుబాటులో ఉన్నాయి.
మొత్తానికి, ఈ ఐస్ క్రీమ్ మోసంను తక్కువగా అంచనా వేయకండి. ఇది మన పిల్లల ఆరోగ్యంపై నెమ్మదిగా వచ్చే పలు ప్రమాదాల రూపం. అందుకే ముందుగానే ఈ విషయాన్ని పసిగట్టండి. లేబుల్స్ చదవండి. పిల్లలకు జాగ్రత్తలు చెప్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫ్యాన్సీ ప్యాకేజింగ్ వెనుక దాగిన మోసం.. పిల్లల పాలిట ప్రాణాంతకం కావచ్చు. ఐస్ క్రీమ్ కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త!