Intermittent Fasting: మన సంస్కృతిలో ఉపవాసం ఒక అంతర్భాగం. పండుగలు, ప్రత్యేక సందర్భాలలో చాలా మంది ఉపవాసం ఉండటం మనం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భాల్లో కొందరు కఠినంగా ఆహారం, నీరు కూడా తీసుకోకుండా ఉంటారు. మరికొందరు పాలు, పండ్లు, అల్పాహారం వంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న మరో ఉపవాస పద్ధతి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent Fasting). ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా ఒక ప్రభావవంతమైన మార్గంగా నిరూపించబడింది. కానీ దీని వల్ల గుండెకు ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి ?
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక నిర్ణీత సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవడం, మిగిలిన సమయం ఉపవాసం ఉండటం. ఇది కఠినమైన డైట్ ప్లాన్ కాదు.. కేవలం తినే సమయాలను క్రమబద్ధీకరించే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో ఆహారం ఏమి తినాలి అనే దానికంటే, ఎప్పుడు తినాలి అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతారు. కొత్తగా ఉపవాసం ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక సులభమైన మార్గం.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల బరువు తగ్గడం, జీవక్రియను మెరుగుపడటం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఫలితంగా ఇది చాలా ఆదరణ పొందింది. అయితే.. దీనిపై జరిగిన తాజా పరిశోధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని కొత్త అధ్యయనాల ప్రకారం.. ఈ ఉపవాసం గుండె ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నివేదికలు ఈ ఆహార పద్ధతి వల్ల కలిగే ప్రమాదాల గురించి పునరాలోచించుకోవాలని సూచిస్తున్నాయి.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది ?
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సైంటిఫిక్ సెషన్స్ 2024లో సమర్పించిన ఒక తాజా అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం ఎనిమిది గంటల పాటు ఆహారం తీసుకునే వ్యక్తులలో గుండె జబ్బుల కారణంగా మరణించే ప్రమాదం 91% ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో 20,000 మందికి పైగా వయోజనుల ఆరోగ్య డేటాను పరిశీలించారు. నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
ప్రమాదాలు ఎందుకు పెరుగుతాయి ?
ఈ అధ్యయనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గుండె ఆరోగ్యంపై ఎందుకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందో పూర్తిగా వివరించనప్పటికీ, కొన్ని అంచనాలను వెల్లడించింది. ఉపవాస సమయంలో శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదల కావచ్చు, ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న వారు తక్కువ సమయంలో ఎక్కువ ఆహారం తినే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టకపోతే.. అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు గుండెకు హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ ఉపవాస సమయంలో సరైన పోషకాలు అందకపోతే, అది శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Also Read: ఈ సీడ్స్‌తో.. కొలెస్ట్రాల్ కంట్రోల్
వైద్య నిపుణుల సలహా :
ఈ కొత్త అధ్యయనాల ఫలితాలు మధ్యంతర ఉపవాసం గురించిన గత ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గుండె జబ్బులు ఉన్నవారు లేదా గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు ఈ ఆహార పద్ధతిని పాటించే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా.. ఏ రకమైన ఆహార పద్ధతిని పాటించే ముందు డాక్టర్ లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా స్పందిస్తుంది. ఈ కొత్త నివేదికలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పై మరింత లోతైన పరిశోధన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యం కోసం కేవలం సమయం ప్రకారం తినడం కంటే.. సమతుల్య ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనంపై దృష్టి పెట్టడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.