Seeds For Cholesterol: ప్రస్తుతం చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది గుండె జబ్బులు ,ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల విత్తనాలు .. కొలెస్ట్రాల్ నియంత్రణలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు , యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని ముఖ్యమైన సీడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవిసె గింజలు :
అవిసె గింజలు కొలెస్ట్రాల్ నియంత్రణకు ఉత్తమమైన ఎంపికలలో ఒకటి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ALA చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే.. అవిసె గింజల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను బంధించి, శరీరం దాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. అవిసె గింజలను పొడి రూపంలో స్మూతీస్, పెరుగు లేదా సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
2. చియా గింజలు :
చియా గింజల్లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. చియా గింజల్లో ఉండే ఫైబర్ నీటిని గ్రహించి జెల్ లాంటి పదార్థంగా మారుతుంది. ఇది ఆహారంలో ఉన్న కొవ్వులను బంధించి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. వీటిని నీటిలో నానబెట్టి, స్మూతీస్ లేదా పుడ్డింగ్స్‌లో ఉపయోగించవచ్చు.
3. పొద్దుతిరుగుడు గింజలు :
పొద్దుతిరుగుడు గింజల్లో ఫైటోస్టెరాల్స్ అనే వృక్ష ఆధారిత సమ్మేళనాలు ఉంటాయి. ఈ ఫైటోస్టెరాల్స్ రసాయనికంగా కొలెస్ట్రాల్‌ను పోలి ఉంటాయి. జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధించడంలో సహాయపడతాయి. దీంతోపాటు.. వీటిలో ఉండే విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. పొద్దుతిరుగుడు గింజలను స్నాక్స్‌గా లేదా సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు.
Also Read: ఈ ఒక్క ఫ్రూట్ తింటే..షుగర్ కంట్రోల్ అవుతుంది !
4. గుమ్మడి గింజలు :
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే.. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని వేయించి స్నాక్స్‌గా లేదా సూప్స్ పైన చల్లుకుని తినవచ్చు.
5. నువ్వులు :
నువ్వులు ముఖ్యంగా ఫైటోస్టెరాల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను నిరోధించి.. మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. నువ్వులను వివిధ వంటకాల్లో.. సలాడ్స్‌లో లేదా నువ్వుల నూనె రూపంలో ఉపయోగించవచ్చు. నువ్వులు తరచుగా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి పెరగాలంటే నువ్వులు తినాలి.
ఈ విత్తనాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను కూడా పొందవచ్చు. అయితే.. కేవలం విత్తనాలపైనే ఆధారపడకుండా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, డాక్టర్ సలహాను పాటించడం కూడా చాలా అవసరం.