బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తూ కేరళలో 18 ఏండ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. కన్నూర్ లోని కూథుపరంబకు చెందిన శ్రీనంద.. లావుగా ఉండటంతో చుట్టపక్కల వాళ్లు బాడీ షేమింగ్ చేశారు. ఎదుటి వారి మాటలు భరించలేక ఎలాగైనా బరువు తగ్గాలి అనుకుంది. ఇందుకోసం యూట్యూబ్ లోని టిప్స్ చూస్తూ ఫుడ్ తినడం మానేసింది. సుమారు మూడు నెలల పాటు ఆహారం తీసుకోకుండా, కేవలం మంచినీళ్లు తీసుకుంది. ఆహారం లేకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యింది. తాజాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. గతంలో ఆమె 50 కేజీల బరువు ఉండగా మూడు నెలల్లో ఏకంగా 25 కేజీలు తగ్గడం ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బరువు తగ్గాలనే కోరిక చివరకు ప్రాణాలనే తీసింది.
అనోరెక్సియా నెర్వోసాతో చనిపోయిన శ్రీనంద
చాలా రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో శ్రీనందకు అనోరెక్సియా నెర్వోసా బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. ఆమె దాదాపు 3 నెలలుగా యూట్యూబ్ లో ఉన్న వెయిట్ లాస్ టిప్స్ పాటిస్తూ.. అనోరెక్సియా నెర్వోసాకు గురయ్యింది. ఇంతకీ అనోరెక్సియా నెర్వోసా అంటే ఏంటి? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అనోరెక్సియా నెర్వోసా అనేది తీవ్రమైన ఆహార సంబంధ సమస్య. ఈ వ్యాధితో బాధపడే వారు బరువు పెరుగుతామనే భయంతో ఆహారం పూర్తిగా తగ్గిస్తాయి. కొంత మంది తినడం మానేస్తారు. దీనివల్ల కొద్ది రోజుల్లోనే వారి శరీర బరువు విపరీతంగా తగ్గిపోతుంది. ఈ విధానం మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ రుగ్మత ప్రాణాలను తీసే ప్రమాదం ఉంది.
అతి ప్రయత్నాలతో ఆరోగ్య సమస్యలు
చాలా మంది బరువు పెరగకూడదనే ఆలోనతో తక్కువ కేలరీలు ఉండే ఫుడ్ తీసుకుంటారు. కొవ్వు పదార్థాలను కంప్లీట్ గా మానేస్తారు. బరువు తక్కువగా ఉన్నప్పటికీ బరువు పెరుగుతామనే కారణంగా ఆహారం సరిగా తినరు. శరీరంలో మార్పులను పెద్దగా పట్టించుకోకుండా కేవలం బరువు తగ్గడం మీదే ఫోకస్ పెడతారు. కొంత మంది నిరంతరం వ్యాయామం చేస్తుంటారు. పద్దతి ప్రకారం ఆహారం తీసుకోకపోవడం వల్ల బరువు ప్రమాదకర రీతిలో తగ్గిపోతారు. చివరకు అనోరెక్సియాకు గురవుతారు. శరీరంలో ముఖ్యమైన పోషకాలు తగ్గి, తీవ్రమైన బలహీనతకు గురవుతారు. తక్కువ బరువు కారణంగా హృదయ స్పందన తగ్గుతుంది. అమ్మాయిలకు హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కలుగుతుంది. నెలసరి సరిగా రాదు. శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనంగా మారుతాయి. నిద్ర సమస్యలు తలెత్తుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చివరకు మరణానికి కారణం అవుతుంది.
Read Also: వేసవిలో ఫ్రిజ్ అతిగా వాడేస్తున్నారా? ఈ తిప్పలు తప్పవు!
నిపుణుల సలహాతోనే డైటింగ్..
బరువు తగ్గే విషయంలో కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యామాలలో చూసి డైట్ ఫాలో కావద్దంటున్నారు. లేదంటే, అనారోగ్యానికి గురి కావడంతో పాటు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. శ్రీనంద విషయంలోనూ అలాగే జరిగిందని చెప్తున్నారు.
Read Also: బొద్దింకలు తింటే అంత ఆరోగ్యమా? ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే మతిపోద్ది!