Spicy Food: వేసవి కాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం అనే దానితో పాటు ఏరకంగా ఉన్న ఆహారాన్ని తింటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే కారం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మరింత హాని కలిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దాహం పెరగడం, జీర్ణ సమస్యలు, చర్మం మీద చెడు ప్రభావం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట. వేసవిలో శరీరం వేడిని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లను తప్పకుండా సరి చేసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవిలో వేడి వాతావరణం కారణంగా శరీర ఉష్ణోగ్రత(Body temperature) సహజంగానే పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మిరపకాయలు లేదా కారం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే శరీరంలో వేడి మరింతగా పెరుగుతుందట. ఇది దాహాన్ని పెంచడమే కాకుండా డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీని వల్ల తలనొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయట.
ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్ణం, జీర్ణనాళాలలో ఇర్రిటేషన్ వంటి సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో జీర్ణశక్తి కొంతమేర నెమ్మదించడం సహజమే. అయినప్పటికీ మితిమీరిన మసాలాలు, కారంగా ఉండే ఫుడ్ వల్ల జీర్ణక్రియ మందగిస్తుందట.
కారం ఎక్కువగా తినడం వల్ల చర్మంలో వేడి పెరిగి ముఖంపై మొటిమలు, రాషెస్, జిడ్డు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎండ వేడిమి వల్ల చెమట వస్తుంది. దీంతో చర్మ సమస్యలు మరింతే పెరిగే అవకాశం ఉందట. ఇది ముఖ్యంగా హార్మోనల్ మార్పులతో బాధపడే యువతలో కనిపించే సాధారణ సమస్య అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ALSO READ: వయసు పెరుగుతున్న కొద్దీ నిద్రకు దూరమైపోతున్నారా..?
మితిమీరిన కారం తినడం వల్ల కొందరిలో రక్తపోటు పెరుగుతుందట. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కారం అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే తక్కువగా కారం ఉండే ఆహారన్ని మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో కొంత జాగ్రత్త వహించడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, తక్కువ మసాలా కలిగిన వంటకాలు, పెరుగు, పండ్లు వంటి వాటిని తరచుగా తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా శరీరానికి కావాల్సినన్ని నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిమ్మకాయ రసం, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్లు వంటి వాటితో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.