ఒకప్పుడు భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉండేవారు. పెళ్లయిన కొన్ని నెలలకే గర్భం ధరించేవారు. కానీ ఆధునిక కాలంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయి. మహిళల్లోనూ, పురుషుల్లోనూ కూడా పునరుత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఎన్నో జంటలు పెళ్లయ్యాక బిడ్డలను కనేందుకు వైద్యులు చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి పెళ్లయిన ఏడాదికే బిడ్డ కలిగితే, మరికొందరికి అయిదారేళ్ల వరకు గర్భం ధరించడమే కష్టంగా మారుతుంది. బిడ్డను కనేందుకు గర్భం ధరించేందుకు ప్రయత్నిస్తున్న జంటలతో వారి చుట్టుపక్కల ఉన్నవాళ్లు కొన్ని రకాల విషయాలను చెప్పకూడదు. అవి వారిలో ఎంతో బాధను, మానసిక వేదనను కలిగిస్తాయి. అలాగే వారిని డీమోటివేట్ చేస్తాయి. శిశువు కోసం ప్రయత్నిస్తున్న జంటలకు ఉన్నంతలో మోటివేషన్ అందించాలి. ఆశతో జీవించమని చెప్పాలి. ఎలాంటి విషయాలు వారి దగ్గర మాట్లాడకూడదు తెలుసుకోండి.
ఎప్పుడోసారి పుడతారులే
ఎప్పుడో ఒకసారి పుడతారు, ఆ నిర్ణయాన్ని దేవుడికే వదిలేయండి… అంటూ కొంతమంది పిల్లల కోసం ప్రయాస పడుతున్న జంటలతో మాట్లాడుతూ ఉంటారు. అది వారికి ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. తల్లిదండ్రులుగా ప్రమోషన్ తీసుకోవాలని ఆశపడుతున్నా భార్యాభర్తల దగ్గర ఇలాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడకండి.
దత్తత తీసుకోవచ్చుగా
పిల్లల్ని దత్తత తీసుకోవచ్చనే విషయం అందరికీ తెలిసినదే. కొత్తగా మీరు వెళ్లి ఎవరికీ సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. భార్యాభర్తలు తమ రక్త బంధాన్ని కోరుకుంటారు. ఆ రక్త బంధాన్ని ఈ భూమి మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. మధ్యలో దత్తత తీసుకోమని చెబితే వారు ఇక తమకు పిల్లలు పుట్టరని ఎదుటి వాళ్ళు భావిస్తున్నట్టు అనుకుని ఎంతో బాధపడతారు. పిల్లల విషయంలో భార్యాభర్తల అభిప్రాయాలకు గౌరవించడం చాలా ముఖ్యం.
పిల్లలు ఎందుకు?
కొంతమంది తాము పిల్లల్ని కని పెంచి పెద్ద చేశాక పిల్లల్ని కనాలనుకుంటున్న జంటలకు మాత్రం ‘పిల్లలు ఎందుకండీ? వాళ్ళని భరించలేమండి, వాళ్ళని పెంచలేమండి’ అంటూ ఏవేవో చెబుతారు. అలాంటివి చెప్పడం వల్ల పిల్లలు కనాలనుకునే భార్యాభర్తల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది. పిల్లలు భారం అనుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విషయాలు కూడా మీరు వారితో మాట్లాడొద్దు.
కొంతమంది పెళ్లయ్యాక వెంటనే బిడ్డను కనాలనుకుంటారు. మరికొందరు పాతికేళ్లు దాటాక కనాలనుకుంటారు. ఏదైనా అది వారి వ్యక్తిగత అభిప్రాయం. వాటిలో కూడా కొంతమంది లోపాలు ఎంచుతూ ఉంటారు. పిల్లలను కనేందుకు ఎందుకంత ఆత్రుత అని ఇరవై ఏళ్లకే కనే వారిని అంటూ ఉంటారు. మరికొందరిని ఇంకా పిల్లల్ని కనలేదా? ఎప్పుడు కంటారు? అంటూ దెప్పిపొడుస్తూ ఉంటారు. ఇలాంటి మీ అభిప్రాయాల్ని ఎదుటివారిపై రుద్ది వారిని ఇబ్బంది పెట్టకండి.
కెరీర్ పై దృష్టి పెట్టండి అంటూ…
పిల్లల్ని కనాలనుకునే జంటలను కొన్ని అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందులో మొదటిది కెరీర్. ఎంతోమంది పెద్దలు లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్లు ‘కెరీర్ చూసుకో, పిల్లలు అప్పుడే ఎందుకు’ అంటూ వారి ప్లానింగ్‌ను కూడా దెబ్బతీస్తూ ఉంటారు. ‘పిల్లలు ఎప్పుడైనా పుడతారు. ఉద్యోగం ఇప్పుడే వస్తుంది’ అంటూ తమకు తోచినవి చెబుతూ ఉంటారు. నిజానికి ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టాలంటే సరైన వయసులోనే కనాలి. అలా కనే వాళ్ళని మీ మాటలతో బాధించకండి. పిల్లల విషయం భార్యాభర్తలు మాత్రమే నిర్ణయించుకోవాల్సిన అంశం. ఎప్పుడు కనాలో వారే తెలుసుకుంటారు. మధ్యలో మీరంతా దూరి వారిని డీమోటివేట్ చేయాల్సిన అవసరం లేదు.
Also Read: ఈరోజు డేటింగ్ చేసి రేపు పెళ్లి చేసుకుంటే ఎలా గురూ? ఈ చిట్కా పాటిస్తే మీ లైఫ్ సేఫ్!
పిల్లలు ఎందుకు పుట్టడం లేదు?
కొన్ని జంటలకు పెళ్లయి అయిదేళ్లయినా పిల్లలు కలగరు. అది వారిలో ఉన్న కొన్ని శారీరక సమస్యల వల్ల జరగవచ్చు. అది వారిని అప్పటికే మానసికంగా వేధిస్తూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల ఉన్నవారు ‘మీకు ఎందుకు పిల్లల పుట్టడం లేదు, మీలో లోపం ఉందా? మీ భాగస్వామ్యంలో లోపం ఉందా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఇది వారిని ఎంతో బాధిస్తుంది. వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. పిల్లలు కనే విషయం చాలా సున్నితమైనది. దాన్ని సున్నితంగానే డీల్ చేయాలి. పరుషమైన పదజాలంతో మాట్లాడడం, ఎదుటివారిని బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు.