Pregnant women: ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి తీసుకునే ప్రతి ఆహార పదార్థం నేరుగా శిశువుపై ప్రభావం చూపుతుంది. అందుకే పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, హానికరమైన ఆహార పదార్థాలను తినకుండా ఉండడం కూడా అంతే అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే గర్భిణీలు కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయాలి. లేదా మితంగా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
పూర్తిగా ఉడకని మాంసం
చికెన్, మటన్, ఫిష్ లాంటి మాంసాహారం పూర్తిగా ఉడకకుంటే అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల లిస్టీరియా, సల్మోనెల్లా వంటి బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్తుందట. దీని వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఇది శిశువు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందట.
పాశ్చరైజ్ చేయని పాలు
పాశ్చరైజ్ చేయని పాలు లేదా వాటితో చేసిన చీజ్‌లలో హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుందట. ఇవి శరీరం లోపలికి వెళ్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుందట.
ALSO READ: సమ్మర్ కదా అని సోడా తాగుతున్నారా..?
కెఫీన్
కెఫీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా వీలైనంత వరకు తగ్గించడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్ గర్భధారణ సమయంలో అధికంగా తీసుకుంటే శిశువు బరువు పెరగడం తగ్గిపోతుందట. దీని వల్ల బిడ్డ బ్రెయిన్ డెవలప్మెంట్‌పై కూడా చెడు ప్రభావం పడుతుందట.
ఆల్కహాల్
ఆల్కహాల్ శిశువు మెదడు అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే పొగతాగే అలవాట్లు ఉన్న గర్భిణులు వెంటనే స్మోకింగ్ మానేయాలి. ఇవి గర్భస్రావం లేదా శిశువు జన్మలో లోపాలకు కారణం అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక ఉప్పు, నూనె
అధికంగా ఉప్పు ఉండే చిప్స్, పికిల్స్ వంటి ఆహారం తినడం వల్ల రక్తపోటు పెరగవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల ప్రీ-ఇక్లాంప్సియా అనే ప్రమాదకర వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే అధికంగా ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీలు మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా హానికరమైన ఆహారాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. శిశువు భవిష్యత్తు ఆరోగ్యం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, ఈ అంశాలలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.