20 ఏళ్లుగా బిడ్డలు లేని తల్లిదండ్రులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓ వరంలా మారింది. ఐవీఎఫ్ ద్వారా కూడా పిల్లలు పుట్టరు అని వైద్య నిపుణులు తేల్చేసిన తర్వాత వారికి కొత్త ఆశను చూపించింది ఏఐ. ఏఐ ఆధారిత STAR అనే సాఫ్ట్ వేర్ ఆ దంపతుల జీవితంలో ఆశలు నింపింది. ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది..?
15సార్లు ఐవీఎఫ్..
న్యూయార్క్ కి చెందిన ఓ జంట 20 ఏళ్లుగా సంతానం కోసం వేచి చూస్తోంది. సహజసిద్ధంగా వారికి పిల్లలు పుట్టకపోవడంతో కృత్రిమ గర్భధారణవైపు ఆసక్తి చూపించారు. అయినా ఫలితం లేదు. 15సార్లు ఐవీఎఫ్ చేయించుకున్నారు. కానీ పిల్లలు పుట్టలేదు. భర్తకు ఉన్న అరుదైన సమస్య వల్ల వారికి పిల్లలు కలగలేదు అని తేలింది. అజోస్పెర్మియా అనే సమస్య వారిపాలిట శాపంగా మారింది. దాని వల్ల భర్తలో వీర్యం తగినంతగా ఉత్పత్తి కాదు. స్ఖలన సమయంలో వీర్యాన్ని వెదికి పట్టుకుని ఐవీఎఫ్ కి సిద్ధం చేయడం కష్టం. అందుకే ఐవీఎఫ్ వారి విషయంలో విఫలమైంది. అయితే వీర్యదాత ఎవరైనా ఉంటే వారినుంచి తీసుకున్న స్పెర్మ్ ద్వారా అండాన్ని ఫలదీకరణం చేయవచ్చు. అయితే ఇది భావోద్వేగానికి సంబంధించిన విషయం. అంటే బిడ్డకు ఆయన తండ్రి కాడు అని స్పష్టంగా తెలుస్తుంది. అది వారికి ఇష్టం లేదు. అందుకే 15 ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేదు.
STAR కాపాడిందిలా..
ఇలాంటి సమస్యలపై కొలంబియా విశ్వవిద్యాలయంలోని సంతానోత్పత్తి నిపుణుడు డాక్టర్ జెవ్ విలియమ్స్ పరిశోధనలు చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం ఇటీవల స్పెర్మ్ ట్రాక్ అండ్ రికవరీ, (STAR) అనే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. వీర్య నమూనాలను స్కాన్ చేసి శుక్రకణాలను గుర్తించడం దీనిపని. ఇది కృత్రిమ మేథ ఆధారంగా పనిచేస్తుంది. సంప్రదాయ పద్ధతుల్లో ఐవీఎఫ్ సాధ్యం కానప్పుడు దీన్ని ఉపయోగిస్తారు. వెయ్యి గడ్డివాముల మధ్య ఒక సూదిని పడేసినా.. గంటల వ్యవధిలో దాన్ని STAR పట్టేయగలదు. అలాంటి టెక్నాలజీతో పనిచేస్తున్న ఈ ఏఐ వ్యవస్థ వీర్యాన్ని పసిగడుతుంది. న్యూయార్క్ జంటకు కూడా ఈ STAR టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడింది.
100లో ఒకరికి..
అజోస్పెర్మియా అనేది పురుషుల స్ఖలనంలో స్పెర్మ్ కనిపించని పరిస్థితి. ఇది 100మందిలో ఒకరికి ఉంటుందట. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి పిల్లలు పుట్టడం చాలా కష్టం. ఐవీఎఫ్ ద్వారా కూడా అది అసాధ్యం. పర్యావరణంలో విషపదార్థాలు కలసి ఉండటం, కీమో థెరపీ, మాదక ద్రవ్యాలు వాడటం, వరిబీజం.. వల్ల అజోస్పెర్మియా అనే సమస్య వస్తుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని మందుల ద్వారా నయం చేయవచ్చు. కానీ న్యూయార్క్ జంట విషయంలో అది సాధ్యం కాలేదు. భర్త వల్ల ఇక ఆమెకు పిల్లలు పుట్టరు అని నిర్థారణ అయిన సందర్భంలో STAR టెక్నాలజీ ద్వారా ఐవీఎఫ్ సాధ్యమైంది.
భవిష్యత్ లో ఈ టెక్నాలజీ వల్ల ఇక సంతానలేమి సమస్య అనేదే ఉండదు అని అంటున్నారు నిపుణులు. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ ద్వారా పనిచేసే స్టార్ టెక్నాలజీ.. ఐవీఎఫ్ రంగంలో ఒక మేలి మలుపు అని చెబుతున్నారు. ముందు ముందు దీన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు.