Pneumonia: న్యుమోనియా పిల్లలకు వచ్చే ఒక సాధారణ శ్వాసకోశ వ్యాధి. ఇది ఊపిరితిత్తులలోని గాలి సంచుల కు ఇన్ఫెక్షన్ సోకి, వాటిలో ద్రవం లేదా చీము నిండిపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే పిల్లల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. పిల్లల్లో న్యుమోనియా తరచుగా జలుబు, ఫ్లూ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తర్వాత వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్లు వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. చిన్న పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
న్యుమోనియా ముఖ్య లక్షణాలు:
న్యుమోనియా లక్షణాలు పిల్లల వయసు, ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటాయి.
తీవ్రమైన దగ్గు: పొడి దగ్గు మొదలై, ఆ తర్వాత కఫం లేదా శ్లేష్మంతో కూడిన దగ్గుగా మారుతుంది.
వేగంగా శ్వాస తీసుకోవడం: ఆరోగ్యంగా ఉన్న పిల్లల కంటే వేగంగా శ్వాస తీసుకోవడం న్యుమోనియాకు ఒక ముఖ్యమైన సంకేతం. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం లేదా ఈల శబ్దం రావడం కూడా సాధారణం.
జ్వరం: అధిక జ్వరం (102°F లేదా అంతకంటే ఎక్కువ) తరచుగా కనిపిస్తుంది. జ్వరం మళ్ళీ మళ్ళీ రావడం లేదా తగ్గకపోవడం న్యుమోనియాను సూచిస్తుంది.
ఛాతీ నొప్పి: ముఖ్యంగా దగ్గినప్పుడు లేదా లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తుంది.
నిస్సత్తువ, అలసట: పిల్లలు నీరసంగా, బలహీనంగా కనిపిస్తారు. ఆడుకోవడానికి లేదా సాధారణ కార్యకలాపాల్లో పాల్గొనడానికి శక్తి ఉండదు.
ఆహారం తీసుకోకపోవడం: ఆకలి తగ్గడం, పాలు తాగడానికి ఇ ష్టపడకపోవడం లేదా తగినంత నీరు తీసుకోకపోవడం. ఇది డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది.
పెదవులు, గోళ్ళు నీలం రంగులోకి మారడం: ఇది తీవ్రమైన ఆక్సిజన్ లోపాన్ని సూచిస్తుంది. ఈ పరిస్థితిలో వెంటనే డాక్టర్ల సహాయం తీసుకోవాలి.
న్యుమోనియాకు కారణాలు:
వైరస్లు: సాధారణంగా జలుబు, ఫ్లూ కలిగించే వైరస్లు న్యుమోనియాకు ప్రధాన కారణాలు.
బ్యాక్టీరియా: స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా వంటి బ్యాక్టీరియాలు కూడా న్యుమోనియాకు కారణమవుతాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే న్యుమోనియా సాధారణంగా వైరల్ న్యుమోనియా కంటే తీవ్రంగా ఉంటుంది.
ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి ?
పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ముఖ్యంగా పిల్లలు శ్వాస తీసుకోవడానికి కష్టపడుతున్నా, తీవ్రమైన జ్వరం ఉన్నా, లేదా నిస్సత్తువగా ఉన్నా ఆలస్యం చేయకూడదు. న్యుమోనియా చికిత్సలో యాంటీ బయాటిక్స్ లేదా యాంటీ వైరల్ మందులు వాడతారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పిల్లలు త్వరగా కోలుకుంటారు.
Also Read: వాల్‌నట్స్ గుండెకు ఎలా మేలు చేస్తాయి ?
ముఖ్య జాగ్రత్తలు:
పిల్లలకు టీకాలు వేయించడం (ముఖ్యంగా న్యుమోకోకల్ వ్యాక్సిన్) న్యుమోనియాను నివారించడానికి ఒక ముఖ్యమైన మార్గం.
పిల్లలను పరిశుభ్రంగా ఉంచాలి. చేతులు కడుక్కునేలా ప్రోత్సహించాలి.
జలుబు లేదా ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉంచడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.