Nail Polish: ఈ రోజుల్లో నెయిల్ పాలీష్ అనేది ఫ్యాషన్‌లో ఒక భాగంగా మారిపోయింది. అందమైన కలర్లతో గోళ్లను అలంకరించడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే, నెయిల్ పాలీష్ వాడడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు నెయిల్ పాలీష్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
నెయిల్ పాలీష్ గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నెయిల్ పాలీష్ తరచూ వాడితే, గోళ్లు బలహీనమవుతాయి. నెయిల్ పాలీష్ తొలగించడానికి వాడే అసిటోన్ గోళ్లను పొడిబార్చి, విరిగిపోయేలా చేస్తుంది. అంతేకాదు, నెయిల్ పాలీష్ కింద తేమ చేరి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. గోళ్లు పసుపు రంగులోకి మారడం, పెళుసుగా మారడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
గర్భిణీలకూ సేఫ్ కాదు
నెయిల్ పాలీష్ వాసన కూడా ఆరోగ్యానికి హానికరం. నెయిల్ పాలీష్ వేసేటప్పుడు వచ్చే బలమైన వాసన వల్ల తలనొప్పి, వికారం, మైకం వంటి సమస్యలు తలెత్తవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు ఈ రసాయనాలకు గురైతే, గర్భంలోని శిశువు ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందట. అందుకే, బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో నెయిల్ పాలీష్ వాడడం మంచిది.
క్యాన్సర్ కారకాలు
నెయిల్ పాలీష్‌లో ఉండే కెమికల్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట. టోలుయీన్, ఫార్మాల్డిహైడ్, డిబ్యూటిల్ ఫ్తాలేట్(DBP) వంటి రసాయనాలు చాలా నెయిల్ పాలీష్‌లలో ఉంటాయి. ఈ రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుపోయి, అలర్జీలు, చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులను కలిగించే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ఫార్మాల్డిహైడ్ క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలం నెయిల్ పాలీష్ వాడితే, ఈ రసాయనాల ప్రభావం ఎక్కువై, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.
ALSO READ: ఉదయం 3 గంటలకు నిద్రలేస్తున్నారా? జాగ్రత్త
రిస్క్ తగ్గాలంటే?
ఈ సమస్యలను రాకుండా ఉంటాలంటే కొన్ని రకాల జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కెమికల్స్ చాలా తక్కువగా ఉండే, ‘3-ఫ్రీ’ లేదా ‘5-ఫ్రీ’ నెయిల్ పాలీష్‌లను మాత్రమే వాడాలని అంటున్నారు. వీటిలో హానికరమైన కెమికల్స్ ఉండవట.
గోళ్లకు ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వడానికి కొన్ని రోజులు నెయిల్ పాలీష్ లేకుండా ఉంచడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, గోళ్లను బలంగా ఉంచడానికి పోషకాహారం తీసుకోవాలి. విటమిన్-ఈ, బయోటిన్ గోళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.