Nail Biting: గోళ్లు కొరకడం అనేది చాలామందిలో కనిపించే ఒక అలవాటు. దీనిని ఓనికోఫాజియా అని కూడా అంటారు. ఇది ఒక చెడ్డ అలవాటు అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఏది ఏమైనా దీని వెనక కొన్ని మానసిక, శారీరక కారణాలు కూడా ఉంటాయి. గోళ్లు కొరకడానికి గల మానసిక కారణాలు, దీనిని ఎలా ఆపాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోళ్లు ఎందుకు కొరుకుతారు ? ( సైకాలజీ ప్రకారం)
ఆందోళన, ఒత్తిడి: ఒత్తిడి వల్ల చాలా మంది గోళ్లు కొరుకుతుంటారు. ఏదైనా విషయం గురించి కంగారు పడుతున్నప్పుడు, పరీక్షల ముందు లేదా ముఖ్యమైన మీటింగ్స్, రిజల్ట్స్ సమయంలో చాలా మంది గోళ్లు కొరుకుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఈ అలవాటు ఆందోళనను తాత్కాలికంగా కూడా తగ్గిస్తుంది.
నిరాశ: ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు, ఏదైనా పని కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా మంది గోళ్లు కొరుకుతుంటారు. ఇది మెదడును ఏదో ఒక పనిలో నిమగ్నం చేసి, నిరాశను దూరం చేయడానికి సహాయ పడుతుంది.
పరిపూర్ణత: చాలా మంది గోళ్లు సరిగ్గా లేవని అనుకున్నప్పుడు వాటిని సరిచేయడానికి కూడా కొరకడం ప్రారంభిస్తారు. ఇది కూడా ఒక రకమైన ఒత్తిడికి కారణం అని చెప్పొచ్చు.
మానసిక కారణాలు : కొన్నిసార్లు ఇది అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ వంటి కొన్ని మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారు కూడా గోళ్లు కొరుకుతుంటారు. ఈ అలవాటును పూర్తిగా నివారించడానికి డాక్టర్ సలహా తీసుకోవడం ఎంతైనా అవసరం.
గోళ్లను కొరకడం ఎలా ఆపాలి ?
ఈ అలవాటును ఆపడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇవి వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి.
కారణాన్ని గుర్తించండి: మీరు ఎలాంటి సందర్భంలో గోళ్లు కొరుకుతున్నారో గమనించండి. ఆందోళనతో ఉన్నప్పుడా, ఒత్తిడిగా ఉన్నప్పుడా లేదా ఖాళీగా ఉన్నప్పుడా ? వీటిలో సరైన కారణాన్ని గుర్తించడం ద్వారా దానిని నియంత్రించడం సులభం అవుతుంది.
Also Read: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్
గోళ్లపై చేదు పదార్థాలు అప్లై చేయండి: గోళ్లు కొరకడానికి ఇబ్బంది కలిగించే నెయిల్ పాలిష్‌లు లేదా ఇతర ప్రొడక్ట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల గోళ్లు కొరకాలనిపించినప్పుడు చేదు రుచి వచ్చి, ఆ అలవాటును మారే అవకాశం కూడా ఉంటుంది.
గోళ్లను క్రమం తప్పకుండా ట్రిమ్ చేయండి: మీ గోళ్లను ఎల్లప్పుడూ చిన్నగా కట్ చేసి, ఫైల్ చేయడం వల్ల కొరకడానికి ఏమీ ఉండదు. దీంతో ఈ అలవాటు తగ్గుతుంది.
ఒత్తిడి తగ్గించుకోండి: గోళ్లు కొరకడం అనేది ఒత్తిడి నుంచి బయటపడటానికి ఒక మార్గం కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లేదా వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోండి.
చేతులను బిజీగా ఉంచండి: ఎప్పుడూ చేతులతో ఏదో ఒక పని చేయండి. పెన్ తిప్పడం, రబ్బర్ బ్యాండ్ పట్టుకోవడం, లేదా ఇతర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేయండి.
సహాయం తీసుకోండి: ఈ అలవాటు వల్ల తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతుంటే.. మాత్రం తప్పకుండా డాక్టర్ సంప్రదించండి.