Sudden Weight Loss: ఎలాంటి కారణం లేకుండా మీ బరువు వేగంగా తగ్గుతుంటే, దానిని తేలికగా తీసుకోకండి. ఇది హైపర్ థైరాయిడిజం, డయాబెటిస్, డిప్రెషన్, క్యాన్సర్, గుండె జబ్బులు లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. శరీర జీవక్రియ, హార్మోన్ల మార్పులు లేదా రోగనిరోధక వ్యవస్థ లోపాలు కూడా దీనికి కారణం అవుతాయి.
ఈ రోజుల్లో ప్రజలు బరువు తగ్గడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేసే వారు చాలా మందే ఉన్నారు. కానీ ఎటువంటి ప్రయత్నం లేకుండానే మీరు అకస్మాత్తుగా బరువు తగ్గడం ప్రారంభించినప్పుడు అది ఆందోళన కలిగించే విషయం. మీ ఆహారం సరిగ్గా ఉండి కూడా మీ బరువు వేగంగా తగ్గుతుంటే.. దానిని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతం కూడా కావచ్చు.
1. హైపర్ థైరాయిడిజం:
థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా చురుగ్గా మారితే దానిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. అంతే కాకుండా దీని కారణంగా శరీరం కేలరీలను వేగంగా బర్న్ చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.
2. రుమటాయిడ్ ఆర్థరైటిస్: ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ కీళ్ల లైనింగ్‌పై దాడి చేయడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో.. శరీరం యొక్క జీవక్రియ వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
3. డయాబెటిస్: మీకు టైప్ 1 డయాబెటిస్ ఉంటే.. శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. దీని వలన శక్తి కోసం గ్లూకోజ్ ఉపయోగించబడదు. ఫలితంగా వేగంగా బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి కారణం అవుతుంది.
4. డిప్రెషన్: మానసిక ఆరోగ్యం కూడా బరువును ప్రభావితం చేస్తుంది. నిరాశ, ఒత్తిడి, ఆందోళన ఆకలి తగ్గడానికి కారణమవుతాయి లేదా సదరు వ్యక్తి తినడం కూడా మానేయవచ్చు. క్రమంగా ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది. డిప్రెషన్ ఆకలి కోరికను చంపివేస్తుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఇది బరువు తగ్గడానికి కారణం అవుతుంది.
5. క్యాన్సర్: అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. వేగంగా బరువు తగ్గడం క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణం కావచ్చు. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు, కడుపు, క్లోమం , అన్నవాహిక క్యాన్సర్లలో సాధారణం. ఉన్నట్లుండి బరువులో మార్పు వచ్చిదంటే.. మీరు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
6. గుండె జబ్బులు: కార్డియాక్ క్యాచెక్సియా అనే స్థితిలో.. శరీరం కండరాలు, ఎముకలు, కొవ్వును వేగంగా కోల్పోతుంది. దీనివల్ల ఒక వ్యక్తి వేగంగా బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు త్వరగా బరువు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
Also Read: ఈ హెయిర్ సీరం వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !
డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి ?
ఎటువంటి కారణం లేకుండా 6 నుండి 12 నెలల్లో శరీర బరువులో 5% తగ్గితే.. వెంటనే డాక్టర్‌లను సంప్రదించండి. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు.