వీకెండ్ అంటే కేవలం పనికి విరామం మాత్రమే కాదు. మన కోసం కొంత సమయం కేటాయించుకునే మంచి అవకాశం కూడా. వారమంతా ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో చాలా మంది బిజీగా గడుపుతారు. దీంతో శారీరకంగా, మానసికంగా అలసట పెరుగుతుంది. చాలామంది వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోవడం లేదా ఫోన్‌లో సమయం గడపడం చేస్తుంటారు. కానీ కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే శరీరం, మనసు రెండూ తాజాగా మారతాయి.
బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మందికి వారంలో సరైన నిద్ర దొరకదు. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. వీకెండ్‌లో ఒకటి లేదా రెండు గంటలు అదనంగా నిద్రపోవచ్చు. అయితే మధ్యాహ్నం వరకు మంచంలోనే ఉండిపోకూడదు. సరైన నిద్ర వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లు మనసును ఎప్పుడూ బిజీగా ఉంచుతాయి. నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు కూడా ఒత్తిడిని పెంచుతాయి. రోజులో కనీసం నాలుగు లేదా ఐదు గంటలు ఫోన్‌కు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో సోషల్ మీడియా లేదా ఈ మెయిల్స్‌ను చూడకుండా ఉండటం మంచిది. దీనివల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది.
పచ్చని చెట్లు, జలపాతాలు ఉండే ప్రదేశంలో వాతావరణం స్వచ్ఛంగా, గాలి ఫ్రెష్‌గా ఉంటుంది. అందుకే ప్రకృతి మనసుకు ప్రశాంతనిస్తుంది. ఉదయం లేదా సాయంత్రం సమీపంలోని పార్కుకు వెళ్లడం మంచిది. చెట్లు, పూలు, పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ నడవాలి. నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది.
బిజీ జీవితంలో చాలా మంది తమ అభిరుచులను మర్చిపోతారు. వారాంతంలో పుస్తకాలు చదవడం, సంగీతం వినడం లేదా తోటపని చేయడం వంటి పనులు చేయవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా ఆనందంగా అనిపిస్తుంది.
Also Read: సంతోషం కోసం ప్రపంచమంతా వెతుకుతున్నారా? నిజమైన సంతోషం కోసం ఈ సీక్రెట్స్ తెలుసుకోండి
ఒత్తిడి వల్ల కండరాలు బిగుసుకుపోయి నొప్పులు రావచ్చు. వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా మృదువుగా నూనెతో మసాజ్ చేసుకోవడం మంచిది. గోరువెచ్చని నీటిలో రాక్ సాల్ట్ వేసి కాళ్లను కొంతసేపు ఉంచినా ఉపశమనం లభిస్తుంది.
ఉద్యోగ ఒత్తిడి వల్ల ఒంటరితనం పెరగవచ్చు. వారాంతంలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి మాట్లాడటం మంచిది. సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకోవడం వల్ల మానసిక భారం తగ్గుతుంది.
ఉత్సాహంగా ఉండటానికి ఖరీదైన విహారయాత్రలు అవసరం లేదు. చిన్న చిన్న ఆరోగ్యకరమైన అలవాట్లు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు. సరైన విధంగా వీకెండ్ ఉపయోగించుకుంటే మళ్లీ ఉత్సాహంగా ఆ తరువాత వారాన్ని ప్రారంభించవచ్చు.