ఎవ్వరైనా తినే బ్రేక్ ఫాస్ట్ ఏదైనా ఉందంటే అది ఇడ్లీ. ఇది అనారోగ్యంతో ఉన్నవారికి, ఆరోగ్యంతో ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది. అందుకే వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఇడ్లీని తినేవారి సంఖ్య అధికం. ఇక డయాబెటిస్, హైబీపీ వంటి వాటితో బాధపడేవారు ఇడ్లీనిని అధికంగా తినేందుకు ఇష్టపడతారు. ప్రతిసారీ ఇడ్లీని ఒకేలా చేసుకుంటే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఈసారి కాస్త కొత్తగా ఉప్మా రవ్వ, సేమియాతో ఇడ్లీ చేసి చూడండి. ఇది అద్భుతంగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సులువు.
సేమియా ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ – ఒక కప్పు
పచ్చిమిర్చి – రెండు
ఆవాలు – ఒక స్పూను
నూనె – ఒక స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
పెరుగు – మూడు కప్పులు
సేమ్యా – అర కప్పు
సేమియా ఇడ్లీ రెసిపీ
⦿ ఇడ్లిని వండేందుకు ముందుగా బొంబాయి రవ్వ, సేమియాలను రెడీ చేసుకోవాలి.
⦿ ఇందుకోసం స్టవ్ మీద కళాయి పెట్టి బొంబాయి రవ్వను వేయించాలి. దాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
⦿ ఇప్పుడు సేమియాని కూడా వేసి వేయించి రవ్వలోనే వేసి కలుపుకోవాలి.
⦿ ఇప్పుడు ఆ రెండింటిలో పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
⦿ అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు చిటపటలాడించి వాటిని కూడా రవ్వ, సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇడ్లీ వేయడానికి పిండి ఎంత మందంగా కావాలో అంత మందానికి వచ్చే వరకు నీటిని కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన ఉంచేయాలని. రవ్వ బాగా నానుతుంది.
⦿ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి లేదా నూనె రాసి ఈ మిశ్రమాన్ని ఇడ్లీల్లో వేసుకోవాలి.
⦿ వాటిని ఇడ్లీ స్టాండ్ లో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి.
⦿ ఒక పావుగంటకు టేస్టీ సేమియా ఇడ్లీ రెడీ అయిపోతుంది.
⦿ దీన్ని కొబ్బరి చట్నీతో లేదా వేరుశనగ పలుకులు చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది.
⦿ ఒకసారి ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఈ ఇడ్లీలు నచ్చుతాయి.
Also Read: కోడిగుడ్డు లేదా పనీర్… బ్రేక్ ఫాస్ట్‌లో ఏది తింటే త్వరగా బరువు తగ్గుతారు?
పిల్లలకు ఈ ఇడ్లీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇందులో మనము తాలింపు కూడా వేసాము. కాబట్టి రుచిగా ఉంటుంది. అయితే దీనితో పోలిస్తే సాధారణ ఇడ్లీలే ఆరోగ్యకరమని చెప్పాలి. గుండెజబ్బుల బారిన పడినవారు, జ్వరంతో ఉన్నవారు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు నూనె కలపని సాధారణ ఇడ్లీలు తినడమే మంచిది. అప్పుడప్పుడు టేస్ట్ కోసం ఈ సేమియా ఇడ్లీలను తినవచ్చు.