Eye Care: నేటి డిజిటల్, ఆధునిక జీవనశైలిలో మనం గంటల తరబడి ఎయిర్ కండిషనర్ (AC) యొక్క చల్లని వాతావరణంలో గడుపుతాము. నిశితంగా గమనిస్తే.. వేసవి కాలంలో మాల్స్ నుండి మెట్రో వరకు బహిరంగ ప్రదేశాలలో కూడా మనం తరచుగా AC యొక్క చల్లని వాతావరణంలోనే ఉంటాము. సమ్మర్‌లో ఏసీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల మీ కళ్ళపై చెడు ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. AC యొక్క చల్లని, పొడి వాతావరణం కళ్ళలోని తేమను తగ్గిస్తుంది. ఇది డ్రై ఐ సిండ్రోమ్ , కంటి చికాకు వంటి సమస్యలను కలిగిస్తుంది.
ముఖ్యంగా స్క్రీన్లపై ఎక్కువ గంటలు పనిచేసే వారికి ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కళ్ళపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ? ఈ సమస్య నుండి బయటపడటానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏసీ గాలి గది నుండి తేమను పీల్చుకుంటుంది. తర్వాత గాలి పొడిగా మారుతుంది. ఈ పొడి గాలి మన కళ్ళను తాకినప్పుడు.. అది కళ్ళ ఉపరితలంపై ఉన్న కన్నీటి పొరను వేగంగా ఎండిపోయేలా చేస్తుంది. ఈ కన్నీటి పొర కళ్ళకు పోషణ అందించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఏసీ దీనికి హాని కలిగిస్తుంది.
కంటి వ్యాధులు:
కన్నీళ్లు ఎండిపోవడం వల్ల.. కళ్ళు పొడిగా, అసౌకర్యంగా అనిపించడం జరుగుతుంది. దీనిని ‘డ్రై ఐ సిండ్రోమ్’ అంటారు. కాంటాక్ట్ లెన్సులు ధరించేవారికి లేదా ఇప్పటికే డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారికి ఈ సమస్య మరింత తీవ్రం అవుతుంది. ACలలో స్క్రీన్‌లపై పనిచేసే వ్యక్తులు తక్కువగా రెప్పవేయడం వల్ల ‘డ్రై ఐ సిండ్రోమ్’ ప్రమాదం పెరుగుతుంది.
AC యొక్క ప్రభావాలు:
కళ్ల మంట, దురద, ఎరుపు, అస్పష్టమైన కంటి చూపు, కంటి నొప్పి లేదా అలసట వంటివి ఏపీ వల్ల వస్తాయి. మీకు కంటి సంబంధిత సమస్యలు కూడా ఉంటే మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. దీంతో పాటు సమస్యను నివారించడానికి మీరు కొన్ని సాధారణ టిప్స్ కూడా అనుసరించవచ్చు.
తరచుగా రెప్పవేయండి:
ఇది సులభమైన, అత్యంత ప్రభావ వంతమైన మార్గం. రెప్పవేయడం వల్ల కళ్ళు తేమగా ఉంటాయి. అంతే కాకుండా కన్నీటి పొర తిరిగి ఏర్పడుతుంది. స్క్రీన్‌పై పనిచేసేటప్పుడు ఇది చాలా ముఖ్యం.
స్క్రీన్ నుండి విరామం తీసుకోండి:
మీరు కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ లను ఎక్కువసేపు పనిచేస్తుంటే..30 నిమిషాలకు ఒకసారైనా కళ్ళను స్క్రీన్ పై నుండి మళ్లించి మీ చుట్టూ ఉన్న వస్తువులను చూసి రెప్పవేయండి. ఇది కళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
Also Read: ఈ ఆయిల్స్ వాడితే.. తెల్ల జుట్టు రమ్మన్నా రాదు !
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోండి:
తగినంత నీరు తాగడం వల్ల మీ శరీరం హైడ్రేటెడ్ గా ఉండటమే కాకుండా.. మీ కళ్ళలో కన్నీళ్లు ఉత్పత్తి అవ్వడానికి కూడా సహాయపడుతుంది. అందుకే రోజంతా తగినంత నీరు త్రాగాలి.