Mayonnaise: బర్గర్లు, మోమోలు లేదా శాండ్‌విచ్‌లతో వడ్డించే తెల్లటి క్రీమీ సాస్ ( మయోనైజ్) అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా లొట్టలేసుకుంటూ తింటుంటారు. కానీ ఈ మయోనైజ్ తయారు చేయడంలో, నిల్వ చేయడంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని కొన్ని రాష్ట్రాల్లో దీనిని బ్యాన్ చేశారు. మయోనైజ్ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మయోనైజ్ ఎందుకు నిషేధించబడింది ?
మయోనైస్ ఒక చిక్కటి , క్రీమీ సాస్. ఇది ఎగ్ యొక్క పచ్చసొన, నూనె, వెనిగర్ , ఇతర సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది. దీనిని తరచుగా బర్గర్లు, శాండ్‌విచ్‌లు, షావర్మా , మోమోలతో కలిపి సర్వ్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటే మయోనైజ్‌లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం దీనిని ఆహార భద్రత , ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30(2)(a) కింద నిషేధించింది. ఈ నిషేధం ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది.
నివేదికల ప్రకారం.. గుడ్ల నుండి తయారైన మయోనైజ్ లో సాల్మొనెల్లా, ఇ. కోలి , లిస్టెరియా వంటి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇలాంటి చెడిపోయిన మయోనైజ్ తింటే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో.. ఈ ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
మయోనైస్ సామాన్యులకు ఎంత ప్రమాదకరం ?
మయోనైస్ సరిగ్గా తయారు చేయకపోయినా లేదా రిఫ్రిజిరేటర్‌లో సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోయినా.. అది త్వరగా చెడిపోతుంది. చెడిపోయిన మయోన్నైస్ సాధారణంగా కనిపిస్తుంది. కానీ అందులో బ్యాక్టీరియా పెరుగుతుంది. కాబట్టి.. ప్రస్తుతానికి రోడ్డు పక్కన అమ్మే మోమోలు, బర్గర్లు లేదా షవర్మాతో ఇచ్చే మయోనైజ్ తినకుండా ఉండటం మంచిది. ఇంట్లో తయారుచేసిన మయోనైజ్‌లో కూడా, శుభ్రత పాటించడం ముఖ్యం.
Also Read: సమ్మర్‌లో సోంపు వాటర్ తాగడం వల్ల.. మతిపోయే లాభాలు !
మయోనైస్ కు బదులుగా మనం ఏం తినాలి ?
మీరు మయోనైజ్ ఇష్టపడితే.. దానికి బదులుగా మీరు పెరుగు, అవకాడో ఆధారిత డిప్‌లను ఉపయోగించవచ్చు. ఇవి ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా బ్యాక్టీరియా ప్రమాదం నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. మార్కెట్ నుండి మయోనైజ్ కొనుగోలు చేసేటప్పుడు.. దాని ప్యాకింగ్, గడువు తేదీ , బ్రాండ్ ను ఖచ్చితంగా చెక్ చేయండి. మంచి నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఇది సమ్మర్ లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.