Pak Minister Nuclear Threat| పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసీ భారత దేశాన్ని ఉద్దేశించి బహిరంగ బెదిరింపులు చేశారు. భారత్‌పై దాడి చేయడానికి తమ వద్ద ఇప్పటికే అన్ని క్షిపణులతో పాటు 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయని ఆయన మీడియా ముందు అన్నారు. పాకిస్తాన్ వద్ద షహీన్, ఘజ్నవి, ఘోరీ వంటి బాలిస్టిక్ మిసైల్స్ రెడీగా ఉన్నాయని అన్నారు. భారత్ పై గురి పెట్టి ఉంచామని ఓపెన్ గా బెదిరించారు. సింధూ జలాల వినియోగాన్ని భారత్ నిలిపివేత ఇలాగే కొనసాగిస్తే.. పూర్తి స్థాయి యుద్ధానికి ఇండియా కూడా సిద్ధంగా ఉండాలని ఆదివారం హెచ్చరించారు.
పాక్ అణ్వాయుధాలు రహస్య ప్రదేశాల్లో భద్రంగా ఉన్నాయని అబ్బాసీ వెల్లడించారు. “ఇండియా మమ్మల్ని కవ్విస్తే, ఆ అణు ఆయుధాలు ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం. మా వద్ద ఉన్న ఆయుధాలు, క్షిపణులు షోకోసం కాదు. వాటిని ఎక్కడ ఉంచామో ఎవరికీ తెలియదు. మా బాలిస్టిక్ క్షిపణుల లక్ష్యం భారత్” అని ఆయన బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
పాకిస్తాన్ నుంచి వచ్చే ప్రమాదాన్ని భారత్ ఇప్పటికే అర్థం చేసుకున్నదని అబ్బాసీ అన్నారు. గగనతలాన్ని రెండు రోజులు మూసేసినప్పుడు భారత వైమానిక రంగం గందరగోళంలో పడిపోయిందని, ఇది 10 రోజులు కొనసాగితే భారత విమానయాన సంస్థలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్దంగా ఉందని చెప్పారు. పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తాన్ ను నిందించడం సరైనది కాదని.. ఆ ఘటన భారత ప్రభుత్వం భద్రతా వైఫల్యమని చెప్పారు.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో అన్ని సంబంధాలు తెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ కు జీవనాధారమైన సింధూ నది జలాల ప్రవాహాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగా ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన ఒక మంత్రి, మరో ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
Also Read: సింధు నదిలో భారతీయుల రక్తం పారుతుంది.. పాక్ రాష్ట్రపతి కుమారుడి నీచ వ్యాఖ్యలు
పాకిస్తాన్ రాష్ట్రపతి కుమారుడు, ఎంపీ బిలావల్ భుట్టో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సింధూ నదిలో నీటి ప్రవాహం నిలిపివేస్తే.. భారతీయుల రక్తం పారుతుందని అన్నారు. అంతకుముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. “సింధు నదిలో ప్రతి నీటి చుక్క తమదేనని ఆరోపించారు. భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు.
1960లో భారత్, పాకిస్తాన్ దేశాలు సింధు జలాల ఒప్పందాన్ని చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకొని, భారత ప్రభుత్వం ఇప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ పరిణామం పాకిస్తాన్‌పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. పాకిస్తాన్ వ్యవసాయ రంగానికి అవసరమయ్యే నీటిలో సింధు నదుల వాటా సుమారు 80 శాతంగా ఉంది. అంటే, పాకిస్తాన్ వ్యవసాయం ఎక్కువగా ఈ నదులపై ఆధారపడి ఉంది. అంతేకాదు, ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) సుమారు 25 శాతం వాటా కూడా ఈ సింధు నదులవల్లే సమకూరుతోంది.