Sitting Side Effects: నేటి ఆధునిక జీవనశైలిలో.. చాలా మంది ఉద్యోగాలు, పనుల కారణంగా గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తుంది. కంప్యూటర్ ముందు పనిచేయడం, ఎక్కువ దూరం ప్రయాణించడం, టీవీ చూడటం వంటివి మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అయితే.. నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కేవలం బద్ధకం మాత్రమే కాదు.. అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘కూర్చోవడం కొత్త ధూమపానం (Sitting is the new smoking)’ అనే నానుడి ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తుంది.
4 గంటల పాటు ఒకే చోట కూర్చోవడం వల్ల వచ్చే వ్యాధులు:
1. గుండె జబ్బులు, మధుమేహం:
కదలకుండా 4 గంటల పాటు ఒకే చోట కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, టైప్- 2 మధుమేహం వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో కొవ్వులు, చక్కెర జీవక్రియ దెబ్బతింటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకత అభివృద్ధి చెందుతుంది. అంతే కాకుండా ఇది మధుమేహానికి దారితీస్తుంది. ఫలితంగా గుండె కండరాలు బలహీనపడతాయి. రక్త నాళాలు గట్టిపడి, రక్త ప్రసరణ కూడా మందగిస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటికి దారితీయవచ్చు.
2. అధిక బరువు, స్థూలకాయం:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కేలరీలు సరిగ్గా బర్న్ కావు. నిరంతరం కూర్చోవడం వల్ల మెటబాలిక్ రేటు మందగిస్తుంది. అంతే కాకుండా ఇది కొవ్వు పేరుకుపోవడానికి కూడా దారితీస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి స్థూలకాయానికి దారితీస్తుంది. స్థూలకాయం అనేది గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు మూలం.
3. వెన్నెముక, భుజం నొప్పి:
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల వెన్నెముకపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా తప్పుడు భంగిమలో కూర్చుంటే, నడుము నొప్పి, మెడ నొప్పి, భుజం నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. డిస్క్ ప్రొలాప్స్ (నడుము డిస్క్ జారడం) వంటి తీవ్రమైన సమస్యలకు కూడా వస్తుంటాయి. అంతే కాకుండా కండరాలు బిగుసుకుపోయి, బలహీనపడతాయి.
4. కొన్ని రకాల క్యాన్సర్లు:
కొన్ని అధ్యయనాలు నిరంతరం కూర్చోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుందని సూచిస్తున్నాయి. అంతే కాకుండా ఇది శారీరక నిష్క్రియాత్మకత హార్మోన్ల స్థాయిలను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కణాల పెరుగుదలను ప్రభావితం చేసే ప్రోటీన్లను నియంత్రిస్తుంది.
5. డీప్ వీన్ థ్రాంబోసిస్:
ఎక్కువసేపు కాళ్ళు కదపకుండా కూర్చోవడం వల్ల కాళ్ళలో రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. దీనినే డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఈ రక్తం గడ్డకట్టడం విడిపోయి ఊపిరితిత్తులకు చేరుకుంటే పల్మనరీ ఎంబోలిజం అనే ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు.
Also Read: నల్ల మిరియాలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా ?
6. ఆందోళన, డిప్రెషన్:
శారీరక శ్రమ లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. నిరంతరం కూర్చోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శారీరక శ్రమ ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
పరిష్కారం ఏమిటి ?
ఈ సమస్యలను నివారించడానికి.. మీరు ప్రతి 30-60 నిమిషాలకు ఒకసారి లేచి, కొద్దిసేపు నడవండి.. స్టాండింగ్ డెస్క్‌లను ఉపయోగించడం, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, మెట్లు ఎక్కడం వంటి చిన్నపాటి మార్పులు మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, నడవడం, వంటివి చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. చురుకైన జీవనశైలిని అలవర్చుకోండి.