Summer Face Packs: సమ్మర్ రాగానే.. వివిధ రకాల చర్మ సమస్యలు మొదలవుతాయి. ఈ సీజన్‌లో.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, కఠినమైన సూర్యకాంతి నుండి ముఖాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే వేడి, సూర్యకాంతి, దుమ్ము, ధూళి, చెమట కారణంగా చర్మం జిగటగా, మారడంతో పాటు ట్యాన్ పేరుకుపోతుంది.
కొన్నిసార్లు తీవ్రమైన సూర్యకాంతి కారణంగా కూడా చర్మం కూడా రంగు మారుతుంది. ఇలాంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుని వాడాలి. ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్స్ చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి ముఖంపై ట్యాన్ పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి. మరి గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలాంటి ఫేస్ ప్యాక్స్ ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిక్స్ ఫ్రూట్ ఫేస్ ప్యాక్:
వేసవిలో చర్మంపై పండ్లతో తయారు ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే ఆపిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ముఖంపై ఉండే మచ్చలను కూడా తొలగిస్తాయి.
కావలసినవి:
అరటిపండు-½
ఆపిల్- ½
నారింజ – ½
బొప్పాయి ముక్కలు- 2
బియ్యం పిండి- 1 టీస్పూన్
తయారీ విధానం: ముందుగా అరటిపండు, ఆపిల్, బొప్పాయి , నారింజను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక చెంచా బియ్యం పిండి వేసి బాగా కలపండి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం ముఖాన్ని శుభ్రమైన నీటితో వాష్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్‌తో మీ ముఖం తక్షణమే మెరుస్తుంది.
బొప్పాయి మృతకణాలను తొలగిస్తుంది. తద్వారా చర్మ రంగును కూడా మెరుగుపరుస్తుంది. నారింజ పండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
2. పుదీనా ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పుదీనా ఆకులు-10-12
నిమ్మరసం- 1 టీస్పూన్
తయారీ విధానం: ఈ కూలింగ్ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. ముందుగా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి మందపాటి పేస్ట్ తయారు చేసుకోండి. తరువాత దానికి 1 టీస్పూన్ నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఇలా తయారుచేసిన ఫేస్ ప్యాక్‌ను మీ ముఖం నుండి మెడ వరకు అప్లై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 15 నిమిషాలు ఉంచి.. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
పుదీనాలో శీతలీకరణ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మొటిమలు, మచ్చలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ముడతల సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
3. కలబంద, తేనె ఫేస్ ప్యాక్:
కావలసినవి:
కలబంద జెల్-2 టీస్పూన్లు
తేనె-, 1 టీస్పూన్
శనగపిండి- 1 టీస్పూన్
Also Read: ఇంట్లోనే ఇలా నేచురల్ హెయిర్ కలర్స్ తయారు చేసుకుని వాడితే.. తెల్ల జుట్టు మాయం
తయారీ విధానం: కలబంద ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి.. ముందుగా ఒక గిన్నెలో 2 టీస్పూన్ల కలబంద జెల్ లో 1 టీస్పూన్ తేనె కలపండి. తరువాత దానికి 1 టీస్పూన్ శనగ పిండి వేసి మందపాటి పేస్ట్ తయారు చేయండి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖం మీద 15 నిమిషాలు ఉంచి.. ఆపై ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోండి.
సమ్మర్‌లో చర్మ సౌందర్యానికి కలబంద చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మాన్ని చల్లబరచడమే కాకుండా.. అనేక చర్మ సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. తేనె చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా మృదువుగా మారుస్తుంది.