Child Care: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడికి పిల్లలు తమ శరీర ఉష్ణోగ్రతను పెద్దల్లా నియంత్రించుకోలేరు. కొన్ని సులభమైన జాగ్రత్తలతో తల్లిదండ్రులు తమ పిల్లలను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంచుకుంటూ వడదెబ్బ నుండి కాపాడుకునే కొన్ని సాధారణ చిట్కాలు తెలుసుకుందాం.
పిల్లలకు తగినంత ద్రవాలు ఇవ్వాలి, ఆరు నెలల కంటే చిన్న పిల్లలకు తల్లిపాలు లేదా ఫార్ములా పాలు తప్ప నీరు ఇవ్వకూడదు. నీరు ఇవ్వడం వల్ల వారి పోషణ దెబ్బతింటుంది. తరచూ పాలు ఇస్తూ వారిని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఆరు నెలలు దాటిన పిల్లలకు అయినా సరే డాక్టర్ ను సంప్రదించి అప్పుడు తక్కువ మోతాదులో నీరు ఇవ్వండి.
పిల్లలకు దట్టమైన గట్టి దుస్తులు కాకుండా తేలికైన, వదులుగా ఉండే పత్తి వంటి గాలి ఆడే దుస్తులు మాత్రమే వేయాలి. బయటకు వెళ్లినప్పుడు విశాలమైన టోపీ వేసి ముఖాన్ని ఎండ నుంచి కాపాడండి. స్ట్రోలర్ కు కవర్ లేదా గొడుగు ఉపయోగించండి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలను కారులో వదిలిపెట్టకుండా చిన్న చిన్న స్టాప్ లలో కూడా పిల్లలను తీసుకెళ్లండి. కిటికీలు తెరిచి ఉంచిన సరే ఒక్కోసారి కారు లోపలి ఉష్ణోగ్రత కొన్ని నిమిషాల్లో ప్రమాదకర స్థాయికి చేరుకోవచ్చు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పిల్లలను బయటకు తీసుకెళ్లడం మంచిది కాదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చెట్ల నీడ ఉండే పార్కులు ఎంచుకోండి. పోర్టబుల్ ఫ్యాన్ లేదా నీటి స్ప్రే బాటిల్ ను ఉపయోగించండి. ఈ ఎండ వేడి పిల్లల సున్నితమైన చర్మాన్ని కాల్చవచ్చు కాబట్టి ఆట స్థలం వేడిగా ఉందేమో తనిఖీ చేసి వెళ్లడం మంచిదని నిపుణుల సలహా.
ALSO READ: హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే?
ఇంట్లో వాతావరణం చల్లగా ఉంచుకుంటూ ఒకవేళ ఏసి ఉంటె 22-26 డిగ్రీల సెల్సియస్ ఉండేలా చేయండి. ఏసి లేనివారు పగలు కర్టెన్లు వేసి ఎండను అడ్డుకుంటూ రాత్రులు ఫ్యాన్లు వేసి కిటికీలు తెరిచి గాలి ఆడేలా చూసుకోండి. వీటన్నిటితో పాటుగా వేసవిలో నిద్రకు ముందు చల్లని నీటితో స్నానం పిల్లల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి హాయిగా నిద్ర పట్టేలా చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
పిల్లలు నిద్రించే గది ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. గది వేడిగా ఉండడం వల్ల సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ వంటి ప్రమాదం జరగవచ్చు. దుప్పట్లకు బదులు తేలికైన స్లీప్ సాక్ ఉపయోగించి పిల్లల పడకలో దట్టమైన బెడ్డింగ్ లేదా బొమ్మలు ఉండకుండా చూసుకోండి.
వడదెబ్బ లక్షణాలైన చిరాకు, చర్మం ఎర్రబడటం, వేగంగా ఊపిరి తీసుకోవడం వంటివి గమనిస్తూ ఉండండి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పిల్లలను చల్లని ప్రదేశానికి తీసుకెళ్లి, ద్రవాలు ఇచ్చి తడి గుడ్డతో చర్మాన్ని తుడవండి. అయినా తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
నిరంతరం వాతావరణ సూచనలను, వేడి తీవ్రతలను తెలుసుకుంటూ అదనపు ఫార్ములా, నీరు, చల్లదనం కలిగించే వస్తువులు సిద్ధం చేసుకోండి. ఇంటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లైబ్రరీ వంటి చల్లని ప్రదేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేసుకోండి.
తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటే తమ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు. హైడ్రేషన్, సరైన దుస్తులు, చల్లని వాతావరణం పిల్లలల ఆరోగ్యానికి ముఖ్యం. ఏదైనా సమస్య అనిపిస్తే వెంటనే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.