మధుమేహం ఉన్నవారు చాలా మంది ఉదయం లేచిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం గమనిస్తారు. దేశంలో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ డాక్టర్ శ్వేత పాంచాల్ ఇటీవల సోషల్ మీడియాలో దీని గురించి వివరించారు. ఆమె సూచనల ప్రకారం.. రాత్రి తక్కువ ఆహారం తీసుకున్నా లేదా ఆలస్యంగా తిన్నా, లేదా ఏమీ తినకపోయినా ఈ సమస్య కనిపించవచ్చు. చాలామంది దీనికి కారణం తమ ఆహారపు అలవాట్లు అని భావిస్తారు. అయితే దీనికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. దానినే డాన్ ఫెనోమెనన్ అని అంటారు.
డాన్ ఫెనోమెనన్ అనేది శరీరంలో సహజంగా జరిగే హార్మోన్ల ప్రక్రియ. ఇది సాధారణంగా రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో శరీరంలో కార్టిసోల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు శరీరాన్ని నిద్ర నుంచి మేల్కొనేందుకు సిద్ధం చేస్తాయి. అదే సమయంలో కాలేయానికి నిల్వలో ఉన్న గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేయమని సంకేతాలు పంపుతాయి. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
ఈ ప్రక్రియ ప్రతి మనిషిలో జరుగుతుంది. అయితే ఆరోగ్యవంతుల శరీరం విడుదలైన అదనపు గ్లూకోజ్‌ను ఇన్సులిన్ సహాయంతో నియంత్రిస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ సరిపడా పనిచేయకపోవచ్చు. కొందరిలో ఇన్సులిన్ నిరోధకత కూడా ఉంటుంది. దీని కారణంగా రక్తంలోకి వచ్చిన అదనపు గ్లూకోజ్ నియంత్రణలోకి రాదు. అందువల్ల ఉదయం ఏమీ తినకపోయినా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
1. రాత్రి భోజనం త్వరగా చేయండి
సాధ్యమైనంత వరకు సాయంత్రం 7 గంటలలోపు భోజనం పూర్తి చేయండి. రాత్రి ఆలస్యంగా లేదా ఎక్కువగా తినడం వల్ల గ్లూకోజ్ నియంత్రణ దెబ్బతింటుంది.
ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీరు తాగడం మంచిది. టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించడం కంటే నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
లేచిన 30 నిమిషాల్లోపు టిఫిన్ చేయాలి. గుడ్లు, పెరుగు, పప్పులు వంటి ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
ఉదయం కనీసం 10 నిమిషాలు నడవడం మంచిది. శారీరక కదలిక వల్ల కండరాలు గ్లూకోజ్‌ను వినియోగిస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మధుమేహం ఉన్నవారు టిఫిన్ తప్పకుండా తీసుకోవాలి. ఉదయం తినడం మానేస్తే కార్టిసోల్ లెవెల్స్ మరింత పెరిగి షుగర్ పెరిగిపోయే అవకాశాలున్నాయి.
Also Read: ప్రపంచంలోనే అత్యంత అందమైన యువతులు ఏ దేశంలో ఉంటారు? నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే
ఉదయం బ్లడ్ షుగర్ పెరగడం అంటే ఎప్పుడూ మందుల మోతాదు పెంచాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు జీవనశైలిలో చిన్న మార్పులు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, సరైన నిద్ర వంటి అలవాట్లు డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. సమస్య కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.