Summer Skin Care: వేసవి కాలం వచ్చిన వెంటనే.. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. ఈ సీజన్‌లో.. బలమైన సూర్యకాంతి, చెమట, తేమ చర్మంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి సమయంలోనే చాలా మంది వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. కానీ కొన్ని రకాల ప్రొడక్ట్స్ చర్మానికి హాని కలిగిస్తాయి.
వేసవిలో కూడా మీ చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలని మీరు కోరుకుంటే.. మాత్రం ఇప్పుడు చెప్పబోయే ఈ పదార్థాలను కూడా వాడకుండా ఉండటం చాలా మంచిది. మరి ఆ పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం సాధారణంగా ఉపయోగించే అనేక సహజ పదార్థాలు వేసవి కాలంలో మీ చర్మానికి హానికరం అని నిరూపించబడతాయి. వేసవిలో వీటిని తప్పుగా వాడితే చర్మంపై చికాకు, దద్దుర్లు ,ఇతర చర్మ సమస్యలు కూడా వస్తాయి.
నిమ్మరసం:
మీరు నిమ్మరసాన్ని నేరుగా ముఖానికి అప్లై చేయడం అంత మంచిది కాదు. నిమ్మరసంలో ఉండే ఆమ్లం చర్మాన్ని పొడిగా మారుస్తుందని గుర్తుంచుకోండి. అంతే కాకుండా సమ్మర్ లో ముఖానికి నిమ్మరసం అప్లై చేసిన తర్వాత బయటకు వెళ్ళినప్పుడు.. ముఖంపై చికాకు లేదా అలెర్జీ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీలైనంత వరకు నిమ్మరసాన్ని ముఖానికి వాడకుండా ఉంటేనే మంచిది.
ఒక వేళ నిమ్మరసం ముఖానికి వాడాలని అనుకుంటే మాత్రం సమ్మర్ లో తేనె లేదా రోజ్ వాటర్ వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడండి. దీన్ని అప్లై చేసిన తర్వాత.. ఎండలో బయటకు వెళ్ళే ముందు మీ ముఖాన్ని బాగా వాష్ చేయండి. తద్వారా ఎటువంటి హని కలగదు.
పసుపు:
మీ చర్మం సున్నితంగా ఉంటే మాత్రం మీరు మీ ముఖానికి పసుపు వాడటం మానేయండి. చర్మంపై పసుపు అప్లై చేయడం వల్ల కొన్నిసార్లు చర్మంపై వాపు వస్తుంది. ఇది మాత్రమే కాదు.. దీని వాడకం వల్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి, వేసవి కాలంలో పసుపుకు దూరంగా ఉండండి. మీరు పసుపుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. దానిని 10-15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదని గుర్తుంచుకోండి. పసుపు ముఖానికి వాడినప్పుడు తప్పకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
టీ ట్రీ ఆయిల్:
టీ ట్రీ ఆయిల్ చర్మానికి మేలు చేస్తుంది. కానీ దానిని నేరుగా ముఖానికి అప్లై చేయడం వల్ల చికాకు లేదా దురద వంటి సమస్యలు వస్తాయి.ముఖ్యంగా వేసవి కాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. మీరు దీన్ని ఉపయోగించాలనుకుంటే కొబ్బరి లేదా మరేదైనా నూనెతో కలిపిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పెరుగు:
పెరుగు చర్మాన్ని చల్లబరచడానికి, ట్యానింగ్ సమస్యను తగ్గించడానికి ఉపయోగిస్తారు. కానీ దీనిని ఎక్కువగా వాడటం కూడా చర్మానికి హానికరం. వేసవిలో ఎక్కువగా ముఖంపై పెరుగు రాయడం వల్ల చర్మం పొడిబారుతుంది. అంతే కాకుండా సున్నితమైన చర్మం ఉన్నవారు చికాకు లేదా దురద వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటారు.
మీ చర్మం సున్నితంగా ఉంటే.. మాత్రం మీరు మీ ముఖం మీద 10-15 నిమిషాల కంటే ఎక్కువసేపు పెరుగు ఉంచవద్దు. కడిగిన తర్వాత.. వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మ సమస్యలు రాకుండా కాపాడుతుంది.
Also Read: ఇంట్లోనే ఫేస్ క్రీమ్.. తయారు చేసుకుందామా ?
గంధం పేస్ట్:
చందనం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. కానీ చాలా మంది దీనిని ముఖం మీద ఎక్కువసేపు అలాగే ఉంచుతారు. దీనివల్ల చర్మం మరింత పొడిబారి, దద్దుర్లు వస్తాయి.
మీరు గంధపు పేస్ట్ ముఖానికి అప్లై చేస్తే.. మాత్రం 15-20 నిమిషాల తర్వాత కడిగి, ఆపై మీ ముఖానికి మాయిశ్చరైజ్ వాడండి. ఇది మీ చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.