Hypersomnia: నిద్ర అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రపోయినప్పుడు మాత్రమే శరీరానికి రెస్ట్ దొరుకుంతుంది. అంతేకాకుండా మెదడు సక్రమంగా పనిచేయడానికి కూడా నిద్ర చాలా అవసరం. అయితే, అవసరమైన సమయానికి మించి నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా మనిషికి రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర అవసరం. కానీ 9 గంటలకు మించి నిద్రపోతే దాన్ని హైపర్‌సోమ్నియా అనే ఆరోగ్య సమస్యగా పరిగణిస్తారని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక రెండు రోజులు జరిగితే పెద్దగా సమస్య కాదు కానీ దీర్ఘకాలంగా అలాంటి అలవాటు కొనసాగితే ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.
అతిగా నిద్రపోవడానికి, డిప్రెషన్‌కు మధ్య గట్టి సంబంధం ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారు. కొందరికి డిప్రెషన్ కారణంగా ఎక్కువ నిద్ర రావచ్చట. అలాగే, ఎక్కువ నిద్ర వల్ల కూడా డిప్రెషన్ లక్షణాలు పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. నిద్ర, మానసిక ఆరోగ్యం పరస్పరం ప్రభావితం అవుతాయంటున్నారు.
ఎక్కువ నిద్రపోయే వారిలో, అలసట,శారీరక చైతన్యం లోపించడం వంటి లక్షణాలు కనిపంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా వ్యక్తి శారీరక వ్యాయామానికి దూరమవుతాడట. దీంతో బరువు విపరీతంగా పెరిగి ఊబకాయం సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అతి నిద్ర వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర అధికమవడం వల్ల మెటబాలిజం మందగిస్తుందట. దీని వల్ల కూడా గుండెకు హాని కలుగుతుందట.
ALSO READ: డిమెన్షియా ఎందుకు వస్తుంది..?
అతిగా నిద్రపోవడం, టైప్-2 డయబెటిస్ మధ్య సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. శరీరంలో ఇన్సులిన్ రిస్పాన్స్ తగ్గడం వల్ల షుగర్ లెవెల్స్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉందట. అందుకే దీని వల్ల షుగర్ సమస్యలు కూడా ఎక్కువైపోతాయని అంటున్నారు.
ఒకే స్థితిలో ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉందట. చాలా మందిలో అతి నిద్ర కారణంగానే మైగ్రేన్ తీవ్రత పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. నిద్రపోతున్న సమయంలో సెరటోనిన్ లెవెల్స్‌లో మార్పులు రావడం దీనికి కారణమని అంటున్నారు.
ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మెదడు చురుకుదనాన్ని కోల్పోతుందట. దీర్ఘకాలంగా చూస్తే మేధస్సు పనితీరు తగ్గిపోవచ్చు, మెంటల్ అలర్ట్‌నెస్ తగ్గిపోయే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
తగినంత నిద్ర శరీరానికి ఎంతో అవసరం. అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. అందుకే ఎక్కువ సమయాన్ని నిద్రకు కేటాయించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.