Mental Health: జీవితంలో సమస్యలు చాలా కామన్. కానీ మీ చుట్టూ ఉన్న వాతావరణం మంచిది కానప్పుడు అవి మరింత పెద్దవిగా కనిపిస్తాయి. అటువంటి సమయంలోనే మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడంతో పాటు ప్రతికూలతలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. మీరు ఉన్న ప్రదేశంలో సంతోషంగా లేరని భావిస్తే మాత్రం వీలైనంత త్వరగా అక్కడ నుండి దూరంగా వెళ్లడం మంచిది. అంతే కాకుండా కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా కూడా మీరు మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
ప్రతిరోజూ ఒక మంచి పుస్తకం చదవండి:
మీరు నిరాశకు గురవుతున్నట్లు అనిపిస్తే మాత్రం ప్రతిరోజూ మీకు ప్రేరణనిచ్చే మిమ్మల్ని సంతోషంగా ఉంచే మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. ఈ పద్ధతి ప్రతికూల విషయాలకు దూరంగా ఉండటానికి మీకు సహాయపడుతుంది. అంతే కాకుండా మిమ్మల్ని ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది.
తగినంత, మంచి నిద్ర చాలా అవసరం:
మీకు సరిగ్గా నిద్ర రాకపోతే మీరు శారీరకంగా, మానసికంగా కృంగిపోతారు. అంతే కాకుండా అనారోగ్యం బారిన పడి ఒత్తిడికి గురవుతారు. దీనివల్ల మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావడం ప్రారంభిస్తాయి. మీరు ప్రతికూలతకు దూరంగా ఉండాలనుకుంటే ప్రశాంతంగా నిద్ర పోవడం చాలా ముఖ్యం.
ప్రశాంత వాతావరణం:
మానసిక ప్రశాంతత కోసం మంచి వాతావరణంలో కూర్చుని మీకోసం కొంత సమయం కేటాయించండి. ఎందుకంటే ఈ బిజీ జీవితంలో ప్రజలు తమ కంటూ సమయం కేటాయించుకోలేక పోతున్నారు. దీనికి ఉత్తమ పరిష్కారం ఏమిటంటే.. మీరు మీకోసం కొంత సమయం కేటాయించి, మీ జీవితంలో మీకు నచ్చినది , మీరు ఏమి చేయాలనుకుంటున్నారో తెలుసుకుని, మిమ్మల్ని సంతోష పరిచే పని చేయండి.
యోగా, వ్యాయామం:
రోజు వారీ వ్యాయామం, యోగా ఒత్తిడిని తగ్గించి మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రతికూల ఆలోచనలు రావు. యోగా వల్ల మన మనస్సు సానుకూల ఆలోచనలతో నిండిపోతుంది.
ఇవి తింటే.. మానసిక ప్రశాంతత:
ఆకుకూరలు:
ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్, మెగ్నీషియం, ఖనిజాలు , విటమిన్లు అధిక మోతాదులో లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మీ మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్ :
మీరు చాక్లెట్ తినడం ఇష్టపడితే ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు , ఫ్లేవనాయిడ్లు వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి.
Also Read: పాదాలకు మసాజ్ చేస్తే.. ఈ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయ్ !
గింజలు , విత్తనాలు:
సీడ్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు మీ ఆహారంలో సీడ్స్ చేర్చుకోవడం వల్ల ఆందోళన, నిరాశ నుండి బయటపడవచ్చు. బాదం, వాల్‌నట్స్, చియా సీడ్స్, అవిసె గింజలు వంటి గింజల వంటివి మానసిక ఆరోగ్యానికి చాలా మంచివి. అంతే కాకుండా ఇవి మీ మెదడును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
పెరుగు:
మీరు పెరుగు తినడం ఇష్టపడితే పెరుగు తినడం అలవాటు చేసుకోండి. పెరుగులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా యొక్క మూలకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.