Man Defying Age| వయసు మీరుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరికీ ఉంటుంది. దీని కోసం ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యకర జీవనశైలిపై దృష్టిపెడుతున్నారు. దీంతో వృద్ధాప్య ఛాయలను ఫిట్‌నెస్‌తో కొంతవరకు ఆలస్యం చేయవచ్చు. చాలామంది సెలెబ్రిటీలు, సినిమా తారలు ఫిట్‌నెస్, డైట్ కఠినంగా పాటిస్తూ 10 లేదా 15 ఏళ్ల యంగ్‌గా కనిపిస్తుంటారు. కానీ ప్రపంచంలో ఒక వ్యక్తి తన వయసు కంటే ఏకంటా 30 ఏళ్లు యంగ్ లుక్స్‌తో కనిపిస్తున్నాడు. అతని గురించి తెలుసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా అందరూ ఆసక్తి చూపుతున్నారు.
60 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తే అందరి దృష్టి అతనిపైనే పడుతుంది. సింగపూర్‌కు చెందిన మోడల్, ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ చువాండో టాన్ విషయంలో ఇదే జరుగుతోంది. 2017లో ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటికి ఆయన వయసు 51 ఏళ్లు. ఆయన అసలు వయసు తెలిసి చాలామంది ఆశ్చర్యపోయారు. అయితే తన యవ్వన రూపం వెనుక ఏదైనా మాయా యాంటీ ఏజింగ్ ఫార్ములా ఉందని టాన్ చెప్పరు. ఆహారం, వ్యాయామం, నిద్ర, జన్యువులు, రోజువారీ అలవాట్లలో స్థిరత్వం తన జీవనశైలిలో భాగమని ఆయన వివిధ సందర్భాల్లో చెప్పారు.
టాన్ 1980, 1990 దశకాల్లో మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. సింగపూర్‌తో పాటు ఆసియాలోని పలు ప్రాంతాల్లో ఆయనకు గుర్తింపు వచ్చింది. తర్వాత ఆయన కెమెరా ముందు నుంచి కెమెరా వెనుకకు మారారు. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్‌గా కూడా మంచి గుర్తింపు పొందారు. ఫిట్‌నెస్, వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా ఆయన ఎప్పటి నుంచో శ్రద్ధ చూపిస్తున్నారు.
తన ఫిట్‌నెస్‌లో ఆహారానికి ముఖ్యమైన స్థానం ఉందని చువాండో చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఉదయం అల్పాహారంలో ఆరు గుడ్లు తీసుకుంటారు. అయితే వాటిలో రెండు గుడ్ల పచ్చసొన మాత్రమే తింటారు. దీంతో పాటు పాలు తీసుకుంటారు. కొన్నిసార్లు అవకాడో, బెర్రీస్, ఓట్‌మీల్ లేదా ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటారు. లంచ్‌లో సాధారణంగా గ్రిల్ చేసిన లేదా ఆవిరితో ఉడికించిన చికెన్ లేదా చేపలు తీసుకుంటారు. వీటితో పాటు అన్నం, కూరగాయలు తింటారు. ఫిష్ సూప్ లేదా బ్రాత్ కూడా ఆయన ఆహారంలో ఉండవచ్చు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారని, తగినంత నీరు తాగుతారని నివేదికలు చెబుతున్నాయి. కాఫీ, మద్యం తీసుకోరు. ధూమపానం కూడా చేయరు.
టాన్ తన వర్కౌట్‌లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో పాటు కార్డియోను కూడా కలుపుతారు. వారానికి మూడు నుంచి 5 రోజులు సుమారు 30 నిమిషాల పాటు స్ట్రెంగ్త్ వ్యాయామాలు చేస్తారని తెలిపారు. స్క్వాట్స్, పుష్ అప్స్, పుల్ అప్స్ వంటి వ్యాయామాలు ఆయన రొటీన్‌లో ఉంటాయి. వేగంగా నడవడం, స్విమ్మింగ్ వంటి తక్కువ తీవ్రత కలిగిన కార్డియో కూడా చేస్తారు.
Also Read: 60 ఏళ్ల వయసులో చనిపోతాడనకుంటే.. 102 ఏళ్లకు ఫిట్‌నెస్ రికార్డులు
ఆయన రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తారు. నిద్రకు కనీసం ఐదు గంటల ముందు చివరి భోజనం పూర్తి చేస్తారని చెప్పారు. నిద్రకు ముందు స్క్రీన్‌లకు దూరంగా ఉండి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తారు.
Also Read: జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలా? ఈ సింపుల్ వాకింగ్ టెక్నిక్స్ చేస్తే సరి
టాన్ చర్మ సంరక్షణలో కూడా సింపుల్ రొటీన్‌ను అనుసరిస్తారు. జెంటిల్ క్లెన్సర్, మాయిశ్చరైజర్ వంటి ప్రాథమిక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయితే ఈ అలవాట్లు అందరికీ ఒకే ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం. వయసు పెరిగే విధానంలో జన్యువులు కూడా ప్రభావం చూపుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, స్థిరమైన జీవనశైలి మొత్తం ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.