Weight Loss Snacking| చాలామంది బరువు తగ్గాలని తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వారికి స్నాక్స్ తినే అలవాటు కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. ముందు బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంటారు.అందుకు తగ్గట్లు రోజుకు ఎన్ని కెలోరీలు తినాలా? ఎన్ని తగ్గించాలా? అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలు అవుతుండగా కడుపులో ఆకలి మొదలవుతుంది. ఒక్కసారిగా చూస్తే, చిప్స్ ప్యాకెట్‌లో సగం తినేసి ఉంటారు. దీంతో ఆ రోజు కెలోరీల లెక్క అక్కడితో ముగిసిపోతుంది. అయితే అప్పటికి ఇంకా సగం రోజు మిగిలే ఉంటుంది. ఈ పరిస్థితి అందరూ ఎదుర్కొంటూనే ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇక్కడ స్నాక్స్ సమస్య కాదు, సరైన విధానంలో స్నాకింగ్ చేయకపోవడం సమస్య. ఎందుకంటే సరిగా స్నాక్స్ తింటే అది మీ బరువు తగ్గే లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుంది.
సరైన స్నాకింగ్ విధానం పాటించాలంటే.. ముందుగా, మీరు ఏం తింటున్నారో తెలుసుకోవాలి. సరైన స్నాక్స్ అంటే ప్రోటీన్‌తో కలిపి ఫైబర్‌ను తినడం. ముందుగా ఉప్పు, చక్కెర నిండిన స్నాక్స్‌ను వదిలేయండి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న స్నాక్స్ ఎంచుకోండి, ఎందుకంటే అవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఇస్తాయి. ఉదాహరణకు, గ్రీక్ యోగర్ట్‌తో చియా సీడ్స్ లేదా ఉడికించిన గుడ్డుతో హమ్మస్ లాంటి ఆరోగ్యకర స్నాక్స్ ట్రై చేయండి. ఆపిల్ ముక్కలతో పీనట్ బటర్ లేదా కాల్చిన శనగలు కూడా మంచి స్నాక్ ఎంపికలు. ఇలాంటి కాంబినేషన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఎక్కువసేపు ఆకలిని దూరంగా ఉంచుతాయి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. స్నాక్స్‌ను నేరుగా ప్యాకెట్ నుండి తినడం మానేయండి. ఈ అలవాటు వల్ల ఎంత తిన్నామో గుర్తుండదు, ఒక్కసారిగా చూస్తే నాలుగు సర్వింగ్‌లు తినేసి ఉంటాం! కాబట్టి, స్నాక్స్‌ను ముందుగానే చిన్న గిన్నెలు లేదా డబ్బాలలో విభజించండి. ఇలా చేయడం వల్ల మీ మెదడుకు ఎప్పుడు ఆపాలో స్పష్టమైన సంకేతం వస్తుంది.
సమయం కూడా ముఖ్యం. మీరు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే స్నాక్ తినండి, ఒత్తిడి లేదా విసుగు వల్ల కాదు. భోజనం తర్వాత 2-3 గంటలకు లేదా వ్యాయామానికి ముందు లేదా మధ్యాహ్నం శక్తి తగ్గినప్పుడు స్నాక్ తినడం మంచిది. ఇలా చేయడం వల్ల అనవసరమైన స్నాకింగ్‌ను నివారించవచ్చు.
Also Read: ఉదయాన్నే ఎనర్జీ కోసం యోగా.. సూర్యకాంతిలో ఈ ఆసనాలతో రోజంతా శక్తి
చివరగా, స్నాకింగ్ మీ శత్రువు కాదని గుర్తుంచుకోండి. ఏ ఆహారమూ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపదు. కేవలం ఆ ఆహారం పరిమితి దాటి తింటేనే సమస్య. అందుకోసం మీ శరీరానికి ఎంత కావాలో తెలుసుకోవాలి. సమతుల్యత ఉద్దేశంతో స్నాకింగ్ చేయడం మీ బరువు తగ్గే ప్రయాణంలో సహాయపడుతుంది. సరైన సమయంలో, సరైన మొత్తంలో, సరైన స్నాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు.