Good Vs Bad Cholesterol: కొలెస్ట్రాల్ అంటే మన శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. మన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కణాలు ఏర్పడటానికి, హార్మోన్లు ఉత్పత్తి చేయడానికి.. అంతే కాకుండా విటమిన్ డి తయారు కావడానికి ఇది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే.. కొలెస్ట్రాల్‌లో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్ (LDL – Low-Density Lipoprotein), మరొకటి మంచి కొలెస్ట్రాల్ (HDL – High-Density Lipoprotein). ఈ రెండింటి మధ్య ఉన్న తేడా, వాటి పాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ :
LDL కొలెస్ట్రాల్‌ను “చెడు కొలెస్ట్రాల్” అని ఎందుకు అంటారంటే.. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయి, ప్రమాదకరమైన బ్లాక్‌లను సృష్టిస్తుంది. ఈ బ్లాక్‌లు హృదయానికి రక్త ప్రసరణను అడ్డుకుంటాయి. కాలక్రమేణా.. ఈ బ్లాక్‌లు గట్టిపడి, ఇరుకుగా మారినప్పుడు అథెరోస్క్లెరోసిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల గుండెపోటు లేదా పక్షవాతం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా.. అధికంగా సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు.. అంటే వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
మంచి కొలెస్ట్రాల్:
HDL కొలెస్ట్రాల్‌ను “మంచి కొలెస్ట్రాల్” అని పిలుస్తారు. ఎందుకంటే.. ఇది శరీరంలోని ఇతర భాగాల నుంచి.. రక్తనాళాల నుంచి అదనపు కొలెస్ట్రాల్‌ను కాలేయానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి దానిని శరీరం బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఈ విధంగా.. మంచి కొలెస్ట్రాల్ రక్తనాళాలను శుభ్రం చేసి.. వాటిలో బ్లాక్‌లు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు, అంటే చేపలు, అవిసె గింజలు, చియా సీడ్స్, అలాగే వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల HDL స్థాయిలు పెరుగుతాయి.
తేడాలు:
మంచి కొలెస్ట్రాల్ :
పాత్ర: శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను కాలేయానికి చేరవేస్తుంది.
పనితీరు: రక్తనాళాలను శుభ్రం చేస్తుంది.
ఆరోగ్యంపై ప్రభావం: గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
పెంచే మార్గాలు: వ్యాయామం, చేపలు, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు.
చెడు కొలెస్ట్రాల్:
పాత్ర: కాలేయం నుంచి కొలెస్ట్రాల్‌ను శరీర భాగాలకు చేరవేస్తుంది.
పనితీరు: రక్తనాళాల్లో పేరుకుపోయి, అడ్డంకులను సృష్టిస్తుంది.
ఆరోగ్యంపై ప్రభావం: గుండెపోటు, పక్షవాతం ప్రమాదాన్ని పెంచుతుంది.
పెంచే మార్గాలు: వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్.
మొత్తంగా.. ఆరోగ్యకరమైన జీవితానికి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. దీనికి సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్య కరమైన జీవన శైలి అవసరం. ప్రతి ఒక్కరూ తమ కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ద్వారా.. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.