Woman Nutrition| చాలా మంది మహిళల ఆరోగ్య సమస్యలకు పోషకాహారమే ముఖ్య కారంణం. చిన్న వయసులోనే ఎముకలు అరిగిపోవడం, రక్తహీనత, రొమ్ము, సర్వికల్ క్యాన్సర్ లాంటి ప్రమాదకర రోగాలతో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు బాధపడుతున్నారు. వైద్య నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఈ సమస్యలన్నింటి ఎక్కువ శాతం పోషాకాహార లోపమే.
అందుకే ఈ రోజుల్లో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి సమతుల ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. హార్మోన్ల సమతుల్యత, శరీరంలో శక్తి ఉత్పత్తి చేయడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పరుగులు తీసే జీవితంలో చాలామంది రోజువారీ ఆహార శైలి సరిగా ఉండడంలేదు. అందుకే అన్ని పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా మహిళల ఆహారంలో ఐరన్, కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి.
ఐరన్‌తో శక్తి: రక్తంలో ఐరన్ తక్కువైతే బలహీనత, అలసట, రక్తస్రావం, తలనొప్పి, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. బచ్చలి, పాలకూర, గోంగూర, తోటకూర, బీట్‌రూట్, చిక్కుళ్ళు, శెనగ, మటన్, గుడ్లు, నట్స్, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరాలు, తృణధాన్యాలు ఐరన్‌ను అందిస్తాయి. విటమిన్-సి ఉన్న నారింజ, బత్తాయి వంటి పండ్లు ఐరన్ ఉత్పత్తిని పెంచుతాయి. గర్భిణులు, యువతులకు రోజూ 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం.
కాల్షియంతో ఎముకల బలం: ఎముకల ఆరోగ్యం కోసం, ముఖ్యంగా మెనోపాజ్ దశలో, కాల్షియం చాలా అవసరం. పాలు, పెరుగు, బాదం, శనగలు, కాలీఫ్లవర్ కాల్షియం అందిస్తాయి. గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ అవసరం. ఆకుకూరలు, మాంసం, దాల్చిన చెక్క నుంచి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: మెదడు ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత కోసం ఫ్లాక్స్ సీడ్స్, వాల్‌నట్స్, చేపలు ఒమేగా-3 అందిస్తాయి. ప్రోటీన్లు కండరాల బలం కోసం మినపప్పు, చికెన్, గుడ్లు, నట్స్ నుంచి పొందవచ్చు. ఫైబర్ జీర్ణ వ్యవస్థకు గోధుమ, మొక్కజొన్న, పండ్లు, కూరగాయలు అవసరం.
బాల్యం – టీనేజ్ దశలో (18 ఏళ్ల వరకు): హార్మోన్ల సమతుల్యత, ఎముకల బలంగా ఉండడానికి ఆకుకూరలు, గుడ్లు, బీట్‌రూట్, పాల ఉత్పత్తులు, మటన్, చికెన్, తినాలి. ఉదాహరణకు, ఉప్మా, గుడ్డు, పాలు (ఉదయం), బ్రౌన్ రైస్, పప్పు, ఆకుకూర (మధ్యాహ్నం), నట్స్, అరటి (సాయంత్రం), రోటీ, కూరగాయలు (రాత్రి).
యువతులు (19-30 ఏళ్లు): రుతుక్రమం, సంతానోత్పత్తి కోసం ఆకుకూరలు, ఫ్లాక్స్ సీడ్స్, చేపలు, పాలు, గోధుమ, పండ్లు తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో: పిండం అభివృద్ధి కోసం ఆకుకూరలు, గుడ్లు, చికెన్, పండ్లు, చేపలు, బ్రౌన్ రైస్ అవసరం.
Also Read: నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారా?.. డిప్రెషన్ నుంచి విముక్తి కోసం ఇలా చేయండి
మెనోపాజ్ దశ: కాల్షియం, విటమిన్-డి కోసం పాల ఉత్పత్తులు, సోయా, చేపలు, బెర్రీలు, గ్రీన్ టీ తీసుకోవాలి. ఉదాహరణకు, ఓట్స్, పాలు (ఉదయం), బ్రౌన్ రైస్, ఆకుకూరలు (మధ్యాహ్నం), గ్రీన్ టీ, నట్స్ (సాయంత్రం), గోధుమ రొట్టె, సూప్ (రాత్రి).
సమతుల్యత ముఖ్యం: అతిగా తినడం లేదా తక్కువ తినడం సమస్యలను తెచ్చిపెడుతుంది. శరీర బరువు, జీవనశైలి ఆధారంగా డైట్ ప్లాన్ చేసుకోవాలి. రోజూ 7,000-8,000 అడుగులు నడవడం, యోగా, సూర్యరశ్మి (15 నిమిషాలు) ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉప్పు, చక్కెర తక్కువగా వాడాలి.