Nani The Paradise: దసరా.. నేచురల్ స్టార్ నాని ( Nani) హీరోగా, శ్రీకాంత్ ఓదెలా (Srikanth odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మాస్ ప్రియులను ఉర్రూతలూగించింది. అయితే మళ్లీ ఇదే కాంబినేషన్లో సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి A సర్టిఫికెట్ లభించింది. పైగా 156 నిమిషాల నిడివితో సినిమా రన్ టైం లాక్ చేశారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న వేళ వెలుగు చూసిన అంశాలు చూస్తుంటే.. ఈ సినిమా చుట్టూ అనూహ్యమైన పొలిటికల్ దుమారం మొదలైంది. అంతేకాదు ఈ అంశం యావత్ సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విషయంలోకి వెళ్తే.. కేవలం రా యాక్షన్ మాత్రమే కాకుండా ఇందులో సమకాలిన రాజకీయాలను టార్గెట్ గా చేస్తూ అత్యంత వివాదాస్పద డైలాగులు, రాజకీయ నాయకుల ప్రస్తావనలు ఉన్నట్లు బయటపడడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ తారాస్థాయికి చేరుకుంది. సాధారణంగా సెన్సార్ సభ్యులు ఒక సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేముందు అందులో హింసపై , బోల్డ్, చూడడానికి కఠినంగా, వినడానికి ఇబ్బందిగా ఉండే సన్నివేశాలపై ఆంక్షలు విధించడం సహజమే. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం సెన్సార్ బోర్డు ఎక్కువగా రాజకీయ అంశాలపై గట్టిగా దృష్టి సారించినట్లు ఈ కట్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇందులో నేరుగా కొంతమంది పొలిటికల్ లీడర్ల పేర్లు వినిపించడం, రాజకీయ వ్యవస్థను ఎండగట్టే తీవ్రమైన సంభాషణలు ఉండడంతో బోర్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదాస్పద పేర్లతో పాటు కొన్ని కీలక డైలాగులను వెంటనే తొలగించాలని లేదా మార్పులు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందట సెన్సార్ బోర్డ్. దీంతో పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్నాయి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా కథలో టార్గెట్ అయిన ఆ రాజకీయ నేతలు ఎవరు? ఎలాంటి రాజకీయ సంచలనాలకు ఈ చిత్రం వేదిక కానుంది ? ఇలా ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ఇకపోతే సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం.. చిత్ర బృందం ఏకంగా 21 మార్పులు చేయాల్సి వచ్చింది. అందులో ముఖ్యంగా రక్తపాతం, టార్చర్ సన్నివేశాలను చాలా వరకు ట్రిమ్ చేశారు. అసభ్యకర పదజాలాన్ని మ్యూట్ చేయగా.. పలుచోట్ల సిగరెట్టు , స్మోకింగ్ బ్రాండ్ వివరాలను మార్చేసారు. ఈ క్రమంలోనే సుమారుగా 25 సెకండ్ల విజువల్స్ ను పూర్తిగా తొలగించగా.. వివాదాస్పదంగా ఉన్న మరో 85 సెకండ్ల దృశ్యాలను ఇతర సన్నివేశాలతో రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మార్పులు , కట్స్ ముగిసిన తర్వాత 2 గంటల 54 నిమిషాల 4 సెకండ్లుగా సినిమా రన్ టైమ్ లాక్ చేశారు.
also read: 18 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్.. శ్వేత ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందా?
ఇన్ని దృశ్యాలు సినిమాలో చేంజ్ చేయడంతో ఇంత వయలెన్స్ ఉందా ? అంటూ అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని సెన్సార్ ఆంక్షలు మధ్య సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. రాఘవ్ జుయల్ , మోహన్ బాబు, సోనాలి కులకర్ణి , సంపూర్ణేష్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.