Rambha urvashi Menaka Teaser: దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ (EVV Sathya Narayana) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ (Naresh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ‘అల్లరి’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈయన.. తనకు మంచి విజయాన్ని అందించిన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని అల్లరి నరేష్ (Allari Naresh) గా చలామణి అవుతున్నారు. ఎన్నో మంచి మంచి సినిమాలతో కామెడీ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. కొంతకాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే రీఎంట్రీలో భాగంగా ‘ నాంది ‘ అంటూ తొలిసారి సీరియస్ మోడ్ లో కనిపించిన నరేష్.. ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు.
ఆ తర్వాత చేసిన మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం, బచ్చలమిల్లి ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. కానీ ఏ ఒక్కటి కూడా నరేష్ కి మంచి విజయాన్ని అందించలేదు. ఆల్కహాల్ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈయన.. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో రంభ ఊర్వశీ మేనక అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అద్భుతమైన కామెడీతో ఆకట్టుకోబోతున్నారు. ఈ మేరకు తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ విడుదల చేయగా.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎప్పటిలాగే నరేష్ తన అల్లరితో ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారని చెప్పవచ్చు.
also read:హీరోయిన్ రాధికకి కూడా తప్పని డబ్బా తిప్పలు.. నిరూపించుకున్నారు మేడం!
చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో రాబోతున్న ఈ ఫాంటసీ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా , నిమ్మకాయల ప్రసాద్ చాలా గ్రాండ్గా నిర్మిస్తున్నారు. రంభ ఊర్వశి మేనక.. “కామెడీ గోస్ కాస్మిక్” అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ మార్కు వినోదంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇందులో వెన్నెల కిషోర్, వీకే నరేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ సంగీతం అందిస్తుండగా.. రంభ ఊర్వశి మేనక పాత్రల్లో రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్ ఇంద్రుడి పాత్ర పోషిస్తున్నారు. సురభి ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది.
రంభ ఊర్వశి మేనక టీజర్ విషయానికి వస్తే.. వీకే నరేష్ మాట్లాడుతూ.. “ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాజిక్ బుక్.. ఈ బుక్కు మీద కరెక్ట్ గా ముగ్గు వేయాలి.. అప్పుడు రంభ ఊర్వశీ మేనక భూమి మీదకు వస్తారు. నువ్వు కోరుకున్న కోరికను నెరవేరుస్తారు “అంటూ నరేష్ తన కొడుకుతో చెబుతాడు. కోరికలను నెరవేర్చుకోవడానికి నరేష్ పడే తపన.. ఇంద్ర లోకం నుంచి భూలోకానికి రంభ ఊర్వశీ మేనక వస్తే ఎలా ఉంటుంది ? అనే ఆసక్తికర కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్ లో సన్నివేశాలు ఫుల్ కామెడీను తలపిస్తున్నాయి. మరి థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సెప్టెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.