Desktop vs Laptop: కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ పని విధానాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంట్లోనే సౌకర్యవంతంగా పనిచేసుకోవడానికి ఒక మంచి ఆఫీస్ డెస్క్ సెటప్ చేసుకోవడం ఇప్పుడు చాలామందికి అవసరంగా మారింది. అయితే ఈ క్రమంలో అందరినీ ఓ ప్రశ్న వేధిస్తుంటుంది. ఇంట్లోకి డెస్క్‌టాప్ కంప్యూటర్ (పిసి) కొనాలా? లేక ల్యాప్‌టాప్ ఎంచుకోవాలా? అని అర్థం కాక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ నేపథ్యంలో మీ అవసరాలకు ఏది సరిగ్గా సరిపోతుందో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మీరు ఒకే చోట స్థిరంగా కూర్చుని ఎక్కువ పని చేసేవారైతే పీసీ (డెస్క్‌టాప్) సరిగ్గా సరిపోతుంది. దీని ప్రధాన బలం కస్టమైజేషన్. అవసరాలకు తగినట్లుగా ప్రాసెసర్, గ్రాఫిక్స్ కార్డ్, ర్యామ్ వంటి భాగాలను విడివిడిగా ఎంచుకుని అసెంబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ భవిష్యత్తులో సాంకేతికత మారినా సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. హెవీ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, కోడింగ్, గేమింగ్ చేసేవారికి ఇది అందించే ప్రాసెసింగ్ స్పీడ్, కూలింగ్ వ్యవస్థ.. ల్యాప్‌టాప్‌ల కంటే చాలా మెరుగ్గా ఉంటాయి. అంతేకాకుండా పెద్ద స్క్రీన్ (మానిటర్) వాడటం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గి.. పని సామర్థ్యం పెరుగుతుంది.
ల్యాప్‌టాప్ అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది ప్రయాణ సౌకర్యం (పోర్టబిలిటీ). ఆఫీస్, ఇల్లు, కాఫీ షాప్ లేదా ప్రయాణాల్లో కూడా పనిచేసుకోవాలనుకునే వారికి ల్యాప్‌టాప్‌ను మించిన ప్రత్యామ్నాయం ఉండదు. పీసీతో పోలిస్తే ఇది చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఎక్కడికైనా మోసుకెళ్లవచ్చు. వైర్ల గోల కూడా దీనిలో అస్సలు ఉండదు. అంతేకాకుండా ఇన్-బిల్ట్ బ్యాటరీ ఉండటం వల్ల విద్యుత్ కోతలు ఉన్నప్పుడు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా పని కొనసాగించవచ్చు.
Also Read: నెట్ స్లోగా ఉందా? మీ ఏరియాలో 5G ఉందో లేదో ఇలా చెక్ చేయండి!
పీసీ, ల్యాప్ టాప్ లలో ఏది కొనాలన్నది మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజూ డెస్క్ వద్ద పనిచేసే వారు, భారీ సాఫ్ట్‌వేర్‌లు, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పవర్ ఉన్న సిస్టమ్ కావాలనుకుంటే పీసీ బెస్ట్ ఆప్షన్. అలాకాకుండా తరచుగా ప్రయాణాలు చేసేవారు, ఆఫీసు-ఇంటికి డివైజ్ మోసుకెళ్లాల్సిన వారు, వైర్ల సమస్య లేకుండా తక్కువ స్పేస్ లోనే వర్క్ ను చేసుకోవడానికి ఇష్టపడేవారు ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయవచ్చు.
Also Read: ప్రకాష్ రాజ్‌కు 4 ఓట్లు? ఇప్పుడు ఒక్క ఓటు కూడా లేదా? అసలు.. SIR ఫారం ఇచ్చారా?