Visakhapatnam AAA Cinemas Opening: విశాఖపట్నం సినీ ప్రియులకు మరో కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్ అందుబాటులోకి వచ్చింది. సిటీ ఇన్‌ఆర్బిట్ మాల్ లో ఏర్పాటు చేసిన AAA సినిమాస్ మల్టీ ప్లెక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా విశాఖకు వచ్చి ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. నిజానికి అల్లు అర్జున్‌కు ఎంతో ఆసక్తి ఉన్న ప్రాజెక్టుల్లో AAA సినిమాస్ ఒకటి. ఈ మల్టీప్లెక్స్ ను ఏషియన్ సినిమాస్, అల్లు అర్జున్ కలిసి ఏర్పాటు చేశారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ థియేటర్ లో ప్రేక్షకులకు కొత్త తరహా సినిమా అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
AAA సినిమాస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు ముందుగానే అంచనా వేశారు. దీంతో ఇన్‌ఆర్బిట్ మాల్ వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా ఆగస్టు 9న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాల్ ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ సమయంలో ప్రైవేట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అయితే సినీ ప్రేక్షకుల కోసం ఈ రోజు రాత్రి 7:30 గంటల నుంచి AAA సినిమాస్ లో సినిమాలు ప్రదర్శించనున్నారు. ఆగస్టు 14, 2026 నుంచి మల్టీప్లెక్స్ లో పూర్తి స్థాయిలో అన్ని స్క్రీన్లపై సినిమాలు ఆడనున్నాయి.
విశాఖ AAA సినిమాస్ కు సంబంధించిన సినిమా టికెట్లు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ‘District by Zomato’ యాప్‌లో మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉంది. సాధారణ సీటు టికెట్ ధరను రూ.177గా నిర్ణయించారు. ప్రీమియం ఎక్స్ పీరియెన్స్ కోరుకునే ప్రేక్షకుల కోసం రిక్లైనర్ సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి టికెట్ ధర రూ.295గా ఉంది. సినిమా, షో టైమింగ్‌ను బట్టి టికెట్ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది.
AAA సినిమాస్ లో మొత్తం 8 స్క్రీన్లు ఉన్నాయి. ప్రీమియం 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ లాంటి ఆధునిక టెక్నాలజీని ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రేక్షకులకు పెద్ద స్క్రీన్ పై మెరుగైన విజువల్స్ తో పాటు థియేటర్ లో లీనమయ్యేలా సౌండ్ ఎక్స్ పీరియెన్స్ లభించనుంది. స్క్రీన్ 1లో 58 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 2లో 76 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 3లో 130 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 4లో 130 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 5లో 436 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 6లో 197 సీట్లు ఉంటాయి. స్క్రీన్ 7లో ఏకంగా 491 సీట్లు ఉన్నాయి. ఇది మల్టీప్లెక్స్ లో మెయిన్ ఫార్మాట్ థియేటర్ గా కొనసాగనుంది. స్క్రీన్ 8లో 34 సీట్లు ఉన్నాయి.
స్క్రీన్ల సంఖ్య పరంగా AAA సినిమాస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఒకే ప్రాంగణంలో 8 స్క్రీన్లు ఉండటంతో వివిధ సినిమాలను ఒకేసారి ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ, పెద్ద స్క్రీన్లు, ప్రీమియం సీటింగ్‌తో AAA సినిమాస్ నగరంలోని సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.
Read Also: అందరికీ నో చెప్పే నయన్.. యశ్ అడగ్గానే అందుకు ఓకే చెప్పిందట.. ‘టాక్సిక్’ ఈవెంట్ లో సర్‌ప్రైజ్!