Dancers Association:టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అక్టోబర్ 11న ఎన్నికలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. జానీ మాస్టర్ భార్య, అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఆమెకు ఊరటనిచ్చింది. ఈ వివాదం వెనుక అసలు ఏం జరిగిందో, హైకోర్టు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో ఇప్పుడు వివరంగా చూద్దాం..
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 23న డ్యాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌ను రద్దు చేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. ఆ వెంటనే సెప్టెంబర్ 24న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అక్టోబర్ 11న కొత్త కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే తమ ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఇంకా చాలా రోజులు ఉందని, అసోసియేషన్‌ను రద్దు చేయడం నిబంధనలకు విరుద్ధమని సుమలతా దేవి అభ్యంతరం వ్యక్తం చేశారు.ఆ వివరాలు చూద్దాం..
ఎన్నికలు నిలిపివేయాలని సుమలతా దేవి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపని ట్రయల్ కోర్టు, తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో, వెంటనే విచారణ జరపాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ట్రయల్ కోర్టు తీరును హైకోర్టు కూడా తీవ్రంగా తప్పుబట్టింది.
ఎన్నికలు అయిపోయిన తర్వాత విచారణ జరిపితే పిటిషనర్‌కు దక్కే న్యాయం నిరర్థకం అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు నవంబర్ 3కి వాయిదా వేయడానికి సరైన కారణాలు లేవని పేర్కొంటూ, సెప్టెంబర్ 28న ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేసింది. ఫెడరేషన్ తరఫు వాదనలు వినిపించే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని స్పష్టమైన ఆంక్షలు విధించింది. అలాగే దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 30కి కేసును వాయిదా వేసింది.
హైకోర్టు తాజా తీర్పుతో ఫెడరేషన్‌కు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన వారికి కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది.ఇక ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం, అసోసియేషన్ రద్దు వంటి అంశాలపై తదుపరి విచారణలో ఎలాంటి సంచలన పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
also read: మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!
మొత్తంగా చూస్తే, కోర్టు ఆదేశాలతో సుమలతా దేవికి తాత్కాలికంగా ఊరట లభించింది.. సరైన నిబంధనలు పాటించకుండా చేపట్టిన ఏ చర్యకైనా కోర్టుల్లో ఎదురుదెబ్బ తగులుతుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మరి రానున్న రోజుల్లో ఫెడరేషన్ ఎలా స్పందిస్తుంది, ఈ వివాదానికి ఎలా తెరపడుతుందనేది వేచి చూడాల్సిందే..