Korean Romantic Comedy Series OTT : ప్రేమకథల్లో ఎన్నో రకాల కాన్సెప్టులు చూసుంటాం. కానీ ఓ అమ్మాయి చేతి స్పర్శ తగిలితే ఇతరులకు కరెంట్ షాక్ కొడుతుంది. అయితే అదే స్పర్శ ఓ వ్యక్తి గుండెను మళ్లీ పనిచేసేలా చేస్తే ? వినడానికి వింతగా ఉన్నా, ఈ కాన్సెప్ట్‌తోనే తెరకెక్కిన కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘Take Charge of My Heart’. ఓవైపు కరెంట్ లా పని చేసే శక్తితో అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చిన అమ్మాయి, మరోవైపు బ్యాటరీపై ఆధారపడి పనిచేసే కృత్రిమ గుండెతో బతుకుతున్న యువకుడు… వీరిద్దరి మధ్య ఏర్పడే బంధమే ఈ సిరీస్‌లో హైలైట్. ప్రేమ, కామెడీ, ఫాంటసీని కలిపి తెరకెక్కించిన ఈ కథను ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఈ వింత ప్రేమకథ ఎలా మొదలవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…
న బో-బే అనే యువతి చిన్నతనంలో పిడుగుపాటుకు గురవుతుంది. ఆ సంఘటన తర్వాత ఆమెలో ఓ విచిత్రమైన విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. ఆమె చేతుల నుంచి విద్యుత్ ప్రభావం బయటకు రావడంతో, ఇతరులను తాకడం కూడా ప్రమాదకరంగా మారుతుంది. సాధారణంగా మనుషుల మధ్య ప్రేమను చూపించడానికి దగ్గరవడం, చేతులు పట్టుకోవడం, ఆప్యాయంగా తాకడం వంటివి సహజం. కానీ బో-బేకు మాత్రం అదే పెద్ద సమస్య. ఎవరినైనా తాకితే వారికి షాక్ తగిలే ప్రమాదం ఉండటంతో, ఆమె చేతులకు గ్లౌజులు వేసుకుని జాగ్రత్తగా జీవిస్తుంది. ప్రేమించాలని ఉన్నా, తన స్పర్శ వల్ల ఎదుటివారికి ప్రమాదం జరుగుతుందేమోనన్న భయం ఆమెను ఒంటరిగా ఉంచుతుంది.
ఇక బేక్ హో-రాంగ్ ఓ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన యువకుడు. అతడు బయటకు చూస్తే ఆత్మవిశ్వాసంతో, హుందాగా కనిపిస్తాడు. కానీ అతడికి పెద్ద బలహీనత ఉంది. అతడి గుండె కృత్రిమమైనది. అది సరిగా పని చేయాలంటే బ్యాటరీపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓ అనుకోని పరిచయం వీరిద్దరినీ దగ్గర చేస్తుంది. బో-బే స్పర్శ వల్ల సాధారణంగా ఇతరులకు షాక్ తగిలినా, హో-రాంగ్ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆమె విద్యుత్ శక్తి అతడికి హాని చేయకపోగా, అతడి కృత్రిమ గుండెకు ఛార్జింగ్ అందించే మార్గంగా మారుతుంది. ఈ విషయం ఇద్దరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. హో-రాంగ్‌కు తన గుండెను పని చేయించుకోవడానికి ఆమె సహాయం అవసరమవుతుంది. బో-బేకు మాత్రం తన స్పర్శను భయపడకుండా స్వీకరించే వ్యక్తి దొరికినట్టవుతుంది.
అయితే వీరి సమస్యలు ఇంతటితో ముగియవు. హో-రాంగ్ గుండె బ్యాటరీ మార్చే శస్త్రచికిత్స తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంతరాయం ఎదుర్కొంటుంది. అతడి గుండెను మళ్లీ స్థిరంగా ఉంచేందుకు బో-బే సమీపంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో శస్త్రచికిత్స జరిగే వరకు మూడు నెలల పాటు ఆమె సహాయం అవసరమవుతుంది. దీనికి బదులుగా హో-రాంగ్ ఆమెకు ప్రేమజీవితంలో ఎదురవని అనుభవాలను అందిస్తానని, ఆమె రొమాన్స్ బకెట్ లిస్ట్‌ను పూర్తి చేయడంలో సహాయం చేస్తానని ఒప్పందం చేసుకుంటాడు. మరి వీరిద్దరి ఒప్పందం నిజమైన ప్రేమగా మారుతుందా ? బో-బే తన శక్తిని శాపంలా కాకుండా ఓ వరంలా చూడగలుగుతుందా ? హో-రాంగ్ తన ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ వ్యాపారంలోనూ నిలదొక్కుకుంటాడా ? ఇవన్నీ సిరీస్‌లో చూడాల్సిందే.
ఈ సిరీస్ కు పార్క్ సూ-వోన్ దర్శకత్వం వహించారు. కిమ్ యంగ్-క్వాంగ్ బేక్ హో-రాంగ్‌గా, ఛే సూ-బిన్ న బో-బేగా నటించారు. ఈ సిరీస్ హేబియోన్ రాసిన ‘Charge Me Up’ అనే వెబ్ నవల ఆధారంగా రూపొందింది. 2026 అక్టోబర్ 9న Netflixలో విడుదలైంది. ఈ కొరియన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ తెలుగులోనూ ఉంది.