Dhurandhar Netflix:సరైన సినిమా పడితే బాక్సాఫీస్‌ని ఎలా షేక్ చేయించవచ్చో ‘ధురంధర్2’తో ప్రూవ్ చేశాడు ఆదిత్య ధర్. ఇక థియేటర్లలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే దుమ్ము రేపుతోంది. సినిమా రిలీజై నెలలు గడిచిపోయినా దీని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదంటే సినిమాని ఆడియన్స్ ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థమవుతుంది. ఇక తాజాగా ఈ మూవీ గురించి నెట్‌ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక మంది చూసిన నాన్-ఇంగ్లీష్ సినిమాగా “ధురంధర్” నిలిచిందని టెడ్ సరాండోస్ స్వయంగా వెల్లడించారు. అంటే ఇంగ్లీష్ సినిమాలను పక్కన పెడితే.. మిగతా అన్ని భాషల్లో వచ్చిన సినిమాల్లో ఈ మూవీనే ఎక్కువ మంది చూసారన్న మాట. ఇది బాలీవుడ్‌కే కాదు.. మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి దక్కిన అరుదైన గౌరవంగా విశ్లేషిస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.
‘ఎక్స్‌ప్రెస్ అడ్డా’ కార్యక్రమంలో మాట్లాడిన టెడ్ సరాండోస్.. 2026 జనవరి నుంచి జూన్ వరకు “ధురంధర్” ఏకంగా 37 మిలియన్ల వ్యూస్ సాధించిందని చెప్పారు. అంతేకాదు.. ఒకేసారి 22 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్-10లో ఈ సినిమా నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచిందని వెల్లడించారు. భారతీయ సినిమా ఒకేసారి ఇన్ని దేశాల్లో ఇలాంటి రికార్డు సాధించడం నిజంగా చిన్న విషయం కాదని ఆయన అన్నారు.
అసలు “ధురంధర్” థియేటర్లలోకి వచ్చినప్పుడే దీని రేంజ్ ఏంటో అర్థమైంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో యాక్షన్, ఎమోషన్, ట్విస్టులు అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగం కోసం అభిమానులు నెలల తరబడి ఎదురు చూశారు. ఆ తర్వాత వచ్చిన “ధురంధర్: ది రివెంజ్” అయితే బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రికార్డులే తిరగరాసింది.
ఈ సీక్వెల్ భారత్‌లో రూ.1000 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించిన తొలి బాలీవుడ్ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇక రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాయి. ఒక ఫ్రాంచైజీకి ఈ స్థాయి కలెక్షన్లు రావడం బాలీవుడ్‌లో చాలా అరుదనే చెప్పాలి. అందుకే ఇప్పుడు “ధురంధర్” పేరు ప్రపంచ సినిమా మార్కెట్‌లో కూడా గట్టిగానే వినిపిస్తోంది.
టెడ్ సరాండోస్ మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. 2024 నుంచి దాదాపు ప్రతి వారం ఏదో ఒక భారతీయ సినిమా లేదా వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10లో చోటు దక్కించుకుంటోందన్నారు. చాలామంది ఇప్పటికీ “స్క్విడ్ గేమ్” లేదా “మనీ హీస్ట్” లాంటి గ్లోబల్ హిట్ ఇండియా నుంచి ఎప్పుడు వస్తుందని అడుగుతుంటారని.. కానీ నిజానికి ఇండియన్ సినిమాలు ఇప్పటికే ఆ స్థాయి విజయాలను వరుసగా అందుకుంటున్నాయని ఆయన చెప్పడం విశేషం.
మొత్తానికి థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో వరల్డ్ నంబర్-1 కూడా కావడం మూవీ టీమ్‌కు మాంచి బూస్టప్ నిచ్చేదే.
also read :“విశ్వనాథ్ అండ్ సన్స్” ట్రైలర్ చూశారా..? చివర్లో ట్విస్ట్ అదిరిపోయింది!
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా “ధురంధర్” గురించే చర్చ నడుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచ నంబర్-1 నాన్-ఇంగ్లీష్ మూవీగా నిలవడంతో ఈ సినిమా పేరు మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మరి ముందు ముందు ఈ సక్సెస్ ట్రాక్‌ని ఆదిత్య ధర్ ఎలా కంటిన్యూ చేస్తాడో చూడాలి!