South Film Heroines: ఒకప్పుడు అందం, అభినయంతో బ్లాక్ అండ్ వైట్ మూవీ లతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎంతోమంది హీరోయిన్లు.. ఇప్పుడు మళ్లీ వయసు మళ్ళిన తర్వాత సడన్ గా దర్శనమిస్తే.. వారిని చూసిన అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఒకప్పుడు అందం, అభినయంతోనే కాదు.. అద్భుతమైన నటనతో.. మన సొంతింటి ఆడపడుచులా ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు.. తర్వాత ఇండస్ట్రీకి దూరమైతే.. మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తారు? అసలు మళ్లీ కెమెరా ముందు కనిపిస్తారా? అని ఆలోచించే అభిమానులు కూడా ఎక్కువే. అయితే అలాంటి అభిమానుల కోసం తాజాగా ఇప్పుడు ఒక ముగ్గురు హీరోయిన్స్ మళ్ళీ కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ ముగ్గురు ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆ ముగ్గురు ఎవరో కాదు దక్షిణాది చలనచిత్ర రంగంలో ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా వెలిగిన లెజెండ్రీ నటీమణులు ఊర్వశి శారద(Urvashi Sarada), సీమ (Seema), షీల (Sheela).. తెలుగు, మలయాళం భాష ఇండస్ట్రీలో వందల సంఖ్యలో చిత్రాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ముందుగా శారద విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు ఊర్వశి శారదాగా సుపరిచితురాలైన ఈమె.. తన సినీ కెరియర్లో ఏకంగా 4 వందలకు పైగా చిత్రాలలో నటించి ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో జన్మించిన ఈమె.. అద్భుతమైన నటనకు గానూ ఏకంగా మూడుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. తులాభారం, స్వయంవరం , నిమజ్జనం చిత్రాలకు ఈమె ఈ అవార్డులు కైవసం చేసుకుంది.
also read: రేణుకాస్వామిని ఇంత దారుణంగా హత్య చేశారా?
మరొక నటి షీలా.. మలయాళ చిత్ర పరిశ్రమలో దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా ఏలిన ఈమె.. మలయాళ సూపర్ స్టార్ ఫ్రేమ్ నజీర్ తో కలిసి ఏకంగా 100కు పైగా చిత్రాలలో జంటగా నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా మలయాళంలో ఈమె ఒక ఐకాన్ అనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత ‘మనస్సి నక్కరే’ అనే చిత్రానికి రీఎంట్రీలో భాగంగా కేరళ రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది.

ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న మూడవ నటి సీమ.. 1970,80 దశకాలలో గ్లామర్ తో , నటనతో ప్రేక్షకులను మెప్పించింది. మొదట గ్రూప్ డాన్సర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. ప్రసిద్ధ దర్శకుడు ఐ.వి.శశి దర్శకత్వంలో వచ్చిన ‘అవలుడే రావుకల్’ అనే చిత్రంలో నటించి.. రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత ఆయననే వివాహం చేసుకుంది. ఇక తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈమె.. బాలకృష్ణ సమరసింహారెడ్డి చిత్రంలో కీలకపాత్ర పోషించింది. అలా ముగ్గురు సమకాలీన నటీమణులు ఒకప్పుడు పోటాపోటీగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే ముగ్గురు మళ్ళీ ఒకే చోట కనిపించి, అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఈ ముగ్గురు కలిసి ఒక ఫంక్షన్ లో కనిపించడం అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.