Keerthy Suresh Satyavan Savitri Teaser:కీర్తి సురేష్..సినిమాలు చేస్తుందన్న మాటే కాని ఒక్కటీ సరైన హిట్ కాని పరిస్థితి.అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెడుతోంది. కథలో హీరోయిన్‌కు ఇంపార్టెన్స్ ఉంటె చాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు అలాంటి మరో సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘సత్యవాన్ సావిత్రి’. ఈ సినిమాకు ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మిస్కిన్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించనుండటం ఇక్కడ విశేషం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు అంచనాలు పెంచేయగా తాజాగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచేసింది.
ఇక టీజర్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచే లాయర్ కావాలని కలలు కనే అమ్మాయి సావిత్రి. తనకు ఇష్టమైన రంగంలోకి వెళ్లేందుకు ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోయినా వెనక్కి తగ్గదు. ఎలాగోలా లా చదివి కోర్టులో అడుగుపెడుతుంది. అయితే కోర్టులో వాదనలు వినిపించడం అంత ఈజీ కాదని ఆమెకు త్వరగానే అర్థమవుతుంది. అనుభవం లేకపోవడంతో తన వాదనలతో జడ్జిలకు కోపం తెప్పిస్తుంటుంది. అయినా సరే తన ప్రయత్నాలను మాత్రం ఆపదు.
సావిత్రికి మార్కండేయ అంటే ఎంతో అభిమానం. ఆయన తనకు స్ఫూర్తిగా భావిస్తూ, ఎప్పటికైనా ఆయనతో కోర్టులో వాదించాలని అనుకుంటుంది. మరి ఆమె కల నిజమవుతుందా? ఒక సాధారణ అమ్మాయిగా మొదలైన ఆమె ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? మరోవైపు భర్తతో సావిత్రికి వచ్చే సమస్యలు ఏంటి? అన్నది సినిమాలో చూడాల్సిందే.
కీర్తి సురేష్ విషయానికి వస్తే లాయర్ పాత్రలు ఈవిడకి కొత్తేమీ కాదు. గతంలో ‘వాశి’ సినిమాలోనూ ఆమె న్యాయవాదిగా కనిపించింది. ఇప్పుడు ‘సత్యవాన్ సావిత్రి’లోనూ అలాంటి పాత్రను ఎంచుకోవడంతో ఈసారి ఆమె నటన ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్.
ఇక ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌కు వచ్చిన గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి జీవితాన్ని తెరపై అద్భుతంగా చూపించింది.ఇక ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డ్ కొట్టేసింది కూడా.ఆ తర్వాత ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖి’ వంటి సినిమాలతో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సత్తా చాటింది
ALSO READ :అగ్గిపెట్టి మచ్చ చివరి కోరిక అదే.. కన్నీళ్లు పెట్టుకున్న ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య!
మొత్తానికి ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్‌తో కీర్తి సురేష్ మరోసారి వార్తల్లో నిలిచింది.చూడాలి మరి ఈ సినిమా కీర్తికి అనుకున్న సక్సెస్ అందిస్తుందో లేదో !