Kanakaraju Controversy:జనాలు కాంట్రవర్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైనా మంటలు పెట్టే మూమెంట్స్ దొరికితే సరే.. లేకుంటే మేమే సినిమాల్లో పని గట్టుకుని మరీ కాంట్రవర్సీ చేసేస్తాం అంటూ రెడీ అయిపోతున్నారు. ఇక ఆ క్రమంలోనే ఒక డైలాగ్ కనిపించినా, ఒక పాత పాట వినిపించినా, ఓ స్టార్ హీరో స్టైల్‌ని గుర్తు చేసే సీన్ వచ్చినా చాలు… వెంటనే స్క్రీన్‌షాట్లు, రీల్స్, ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లు రెడీ చేసేస్తున్నారు.
ఇప్పుడు కొరియన్ కనకరాజు విషయంలో కూడా అదే జరిగింది.
వరుణ్ తేజ్, సత్య కలిసి థియేటర్లలో తెగ నవ్విస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం కొందరు సినిమాలోని కామెడీ సీన్స్‌లో ఉన్న డైలాగుల్ని భూతద్దంలో పెట్టి చూసేస్తున్నారు. యుగంధర్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ “మీ షాట్ చాలా అమెచ్యూరిష్‌గా ఉంది” అనే డైలాగ్ చెబుతారు. ఇక అదే డైలాగ్‌ని ఈ సినిమాలోని కామెడీ సీన్‌లో వాడటంతో వెంటనే చర్చ మొదలైంది. కొందరు అభిమానులు తమ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే, ఇంకొందరు “దీనికి ఇలా హార్ట్ అవుతారా?” అంటూ ఆశ్చర్యపోతున్నారు.
నిజం చెప్పాలంటే తెలుగు సినిమాల్లో ఇలాంటి రిఫరెన్స్‌లు కొత్తేమీ కాదు. ఒక హీరో డైలాగ్‌ని మరో హీరో సినిమాలో చెప్పడం, పాత పాటను కొత్తగా రీమిక్స్ చేయడం, క్లాసిక్ సీన్లకు ట్రిబ్యూట్ ఇవ్వడం… ఇవన్నీ ఏళ్లుగా జరుగుతున్నవే. ప్రేక్షకులు కూడా చాలాసార్లు వాటికి విజిల్స్ వేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయాక, ఒక సీన్ చూసి మొత్తం సినిమాకే తీర్పు చెప్పే ట్రెండ్ మొదలైంది.
అసలు ఆ డైలాగ్ ఏ సందర్భంలో వచ్చింది? కామెడీ కోసమా? నివాళిగా పెట్టారా? లేక నిజంగా ఎవరినైనా కించపరచడానికా? అన్నది చూడకుండా ముందే ఒక అంచనాకి వచ్చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే “కోడి గుడ్డు మీద ఈకలు పీకడం” అనే సామెత గుర్తుకువస్తుంది. ఇప్పుడు కొందరు నెటిజన్లు సినిమాల్లో కూడా అదే చేస్తున్నారు.
అన్నింటికీ మించి ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఒక సినిమాలో డైలాగ్ వినిపించిందంటే అది తప్పనిసరిగా అవమానమే అని చెప్పలేం. చాలాసార్లు దర్శకులు పాత సినిమాలపై తమ అభిమానాన్ని చూపించడానికి కూడా అలాంటి రిఫరెన్స్‌లు పెడుతుంటారు. ప్రేక్షకులు గుర్తుపట్టి ఎంజాయ్ చేస్తారని ఆశపడతారు. కానీ ఇప్పుడు ఎంజాయ్ చేయడం కంటే దాన్ని కాంట్రవర్సీ చేయడమే ఫ్యాషన్ అయిపోయింది. మరో ఫన్నీ విషయం ఏంటంటే… ఇదే డైలాగ్‌పై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వాళ్లలో చాలామంది సినిమా కూడా చూశారా అంటే అనుమానమే.
ఇక ఇదే కాంట్రవర్సీ పై వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆ అమెచ్యూరిష్ సీన్ అనేది సత్యపై నవంబర్ లో షూట్ చేశామని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఇమిటేషన్ కు, ట్రోలింగ్ తేడా ఉంది అని అందరిని నవ్వించడానికి హెల్దీ గా, ఫన్ గా చేసిందే తప్ప కావాలని ట్రోలింగ్ చేయలేదు అంటూ స్పష్టం చేశాడు.ఇక గొప్ప గొప్ప నటులని ఎవరినీ కించపరచడం తమ ఉద్దేశం కాదని మా ప్రమోషన్స్ లో చిరంజీవి కృష్ణ గారిని కూడా ఇమిటేట్ చేశామని, సినిమాలో ఆ డైలాగ్ కూడా అలానే ఉంటుంది..అంటూ వస్తున్న కాంట్రవర్సీ కి ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేశాడు ఈ మెగా ప్రిన్స్.
also read :కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ: వరుణ్ తేజ్‌కు కావాల్సిన హిట్ దొరికిందా?
చివరగా ఒక్క మాట… సినిమా హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనేది ప్రేక్షకులు థియేటర్‌లో నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు కొందరు మాత్రం కథ కంటే కాంట్రవర్సీ కోసం టికెట్ కట్ చేస్తున్నట్టున్నారు. ఇలా ప్రతి డైలాగ్‌ను భూతద్దంలో పెట్టి వెతుకుతుంటే రేపు దర్శకులు డైలాగ్ రాయాలన్నా, నటులు మాట్లాడాలన్నా వందసార్లు ఆలోచిస్తారేమో!