‘Ranabali Movie:కింగ్డమ్’ సినిమాతో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఈసారి ‘రణబాలి’ అంటూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ‘టాక్సీవాలా’ వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.
తాజాగా ఆగస్టు 15 సందర్భంగా ‘రణబాలి’ టీమ్ ఓ క్రేజీ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.
మనకు దక్కిన స్వేచ్ఛ కోసం మన పూర్వీకులు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసిన విజయ్.. స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది చేసిన త్యాగాలను ఎప్పటికీ మర్చిపోవద్దని చెప్పాడు. కుటుంబానికి, దేశానికి మంచి పేరు తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరాడు.
తాజాగా విడుదలైన పోస్టర్‌ను చూస్తే.. సినిమాలో దేశభక్తి అంశాన్ని రాహుల్ సాంకృత్యన్ ఎంత బలంగా చూపించబోతున్నాడో అర్థమవుతోంది.
సినిమా కథ 19వ శతాబ్దం నాటి నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను ఆధారంగా చేసుకుని కథను రూపొందించినట్లు సమాచారం.
అప్పటి బ్రిటిష్ పాలన ఎలా ఉండేది? బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు జరిగాయి? చరిత్రలో పెద్దగా బయటకు రాని సంఘటనలు ఏంటి? వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నారట.
అంటే పుస్తకాల్లో కనిపించే చరిత్రతో పాటు.. అప్పట్లో ప్రచారంలో ఉన్న కొన్ని కథలను కూడా కలిపి ‘రణబాలి’ ప్రపంచాన్ని రాహుల్ సాంకృత్యన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ‘రణబాలి’ ఏదైనా ఒక వ్యక్తి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది ఏ ఒక్కరి బయోపిక్ కాదని తెలుస్తోంది.ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు, బ్రిటిష్ పాలనలో జరిగిన అణిచివేత, స్వేచ్ఛ కోసం ప్రజలు చేసిన పోరాటం వంటి అంశాల చుట్టూ కథ సాగనుందని సమాచారం.
ఇందులో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్.
దేశం కోసం పోరాడే వ్యక్తిగా విజయ్ కనిపించనున్న నేపథ్యంలో.. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీగా ఉండనున్నాయని తెలుస్తోంది.
ముఖ్యంగా విజయ్ పాత్రలోని ఎమోషన్, యాక్షన్ రెండింటినీ దర్శకుడు బలంగా చూపించబోతున్నాడట. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్‌కు ఈ సినిమా మంచి ట్రీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. ఆమె ‘జయమ్మ’ పాత్రలో కనిపించనుందని సమాచారం.ఇప్పటికే విజయ్, రష్మిక జోడీ ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘గీత గోవిందం’లో వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలిచింది.
‘డియర్ కామ్రేడ్’లోనూ ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో.. జయమ్మ–రణబాలి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయనే క్యూరియాసిటీ కూడా పెరిగింది.
‘రణబాలి’లో మరో ఇంట్రెస్టింగ్ అంశం విలన్ క్యారెక్టర్. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
‘ది మమ్మీ’ సినిమాలో ఇమ్‌హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్నాల్డ్ వోస్లూతో విజయ్ దేవరకొండ తలపడటం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన హైలెట్‌గా నిలిచే అవకాశం ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లవ్, యాక్షన్ సినిమాలతో ఎక్కువగా కనిపించిన విజయ్ దేవరకొండ.. తొలిసారి ఇలాంటి పీరియాడిక్ ఫిల్మ్‌లో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ముఖ్యంగా రాహుల్ సాంకృత్యన్ గతంలో ‘టాక్సీవాలా’, ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలతో తనదైన మేకింగ్ చూపించాడు. ఇప్పుడు చరిత్ర, దేశభక్తి, యాక్షన్‌ను కలిపి విజయ్‌తో ఎలాంటి కథ చెప్పబోతున్నాడనేదే ఆసక్తికరంగా మారింది.
ఓ వైపు విజయ్ దేవరకొండకు సరికొత్త పాత్ర.. మరోవైపు రష్మికతో ముచ్చటగా మూడో కాంబినేషన్.. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటించడం.. అన్నింటికంటే ముఖ్యంగా బ్రిటిష్ పాలన, స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో తెరకెక్కుతున్న కథ.. ఇవన్నీ ‘రణబాలి’పై అంచనాలను పెంచుతున్నాయి.
also read:బ్లాక్ డ్రెస్‌లో బిగ్ బాస్ బ్యూటీ అశ్విని శ్రీ.. ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
మరి భారీ అంచనాలు మోస్తున్న ఈ ‘రణబాలి’ వాటిని అందుకుంటుందా? విజయ్ దేవరకొండకు మరో సాలిడ్ హిట్ ఇస్తుందా? అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది!