Rani Mukerji: చిత్ర సినిమాలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ (Rani Mukherjee) తల్లి కృష్ణ ముఖర్జీ (Krishna Mukherjee) 75 ఏళ్ల వయసులో కన్నుమూసారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో అధికారికంగా ధ్రువీకరించారు. “దుఃఖంతో నిండిపోయిన హృదయంతో ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము. శ్రీమతి కృష్ణ ముఖర్జీ సెప్టెంబర్ 22 మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె మరణం పట్ల మరింత దుఃఖిస్తున్నాము. ఈ సమయంలో మాకు ఏకాంతం కావాలి. మీ ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుంది . ఈ అపారమైన దుఃఖ సమయంలో మాకు ఏకాంతం కావాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం” అంటూ రాణీ ముఖర్జీ కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే కృష్ణ ముఖర్జీ మరణానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.
రాణీ ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ మరణించడంతో గతంలో రాణీ ముఖర్జీ తన తల్లి గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో ఆమె తన తల్లితో తనకున్న సాన్నిహిత బంధం గురించి పంచుకుంది. ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ చిత్రంలో రాణీ నటనకు కృష్ణా కూడా ఒక ప్రధాన ప్రేరణగా నిలిచారు . ఈ చిత్రంలో ఆమె తన పిల్లలను తిరిగి పొందడానికి పోరాడే ఒక బెంగాలీ తల్లి పాత్రను పోషించింది.
2023లో జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో రాణీ ముఖర్జీ మాట్లాడుతూ..” నేను నా నిజ జీవిత కథకు సంబంధించిన ఆధారాలను అధ్యయనం చేసినప్పటికీ.. నా పాత్ర ఎక్కువ భాగం నా సొంత తల్లి నుండే స్ఫూర్తి పొందింది. ఇక నేను పోషించిన పాత్ర కోసం కొన్ని రెఫరెన్సులు చూసాను. ఆ పాత్రలోని మిగతా భాగం నిజానికి మా అమ్మపై ఆధారపడి ఉంది. నాకు తెలిసినంతలో ఆమే అత్యంత బెంగాలీ వ్యక్తి. మాకు చేతులతో తినిపించడం .. బొట్టు పెట్టడం.. ఇలా అన్ని విషయాలలో నేను మా అమ్మ నుండే బలం, స్ఫూర్తి పొందాను” అంటూ వెల్లడించింది రాణీ ముఖర్జీ.
రాణీ ముఖర్జీ తల్లి గానే కాకుండా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకున్నారు కృష్ణా ముఖర్జీ . ఒక మాజీ నేపథ్య గాయని, ఫిల్మాలయ స్టూడియోస్ సహ వ్యవస్థకుడైన చిత్ర నిర్మాత రామ్ ముఖర్జీని ఈమె వివాహం చేసుకున్నారు. 2017లో రామ్ ముఖర్జీ మరణించగా.. సరిగ్గా ఎనిమిదేళ్ల తర్వాత కృష్ణ ముఖర్జీ కూడా తుది శ్వాస విడవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ALSO READ: పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఝాన్సీ అప్లై చేస్తోందా.. చరణ్ మాటలకు అర్థం?
ఇకపోతే ఈ ఏడాది ఆగస్టు నెలలో రాణీ ముఖర్జీకి ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత లాట్రోబ్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్ లభించింది. సుమారుగా మూడు దశాబ్దాల పాటు సినీ పరిశ్రమకు అందించిన సేవలతో పాటు మహిళలు, పిల్లలు, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నత కోసం ఆమె చేసిన సామాజిక సేవ కార్యక్రమాలను గుర్తించి, ఈ అరుదైన గౌరవాన్ని అందించినట్లు యూనివర్సిటీ తెలిపింది. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మేల్బోర్న్ వేడుకల్లో భాగంగా ఆమె ఈ డాక్టరేట్ ను అందుకున్నారు .
ఇకపోతే ఈ సంతోషం కలిగి నెల రోజుల్లోనే తల్లిని కోల్పోవడంతో సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటే అంటూ నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ మరణ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.