Sankranti Clash: సంక్రాంతి …ఈ పండగంటే కేవలం పిండి వంటలు, గాలిపటాలు మాత్రమే కాదు… అంతకుమించిన సినిమా జాతర. పండక్కి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పటికీ, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడే వేడి మొదలైపోయింది. ఏకంగా అరడజనుకు పైగా భారీ చిత్రాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచేందుకు క్యూ కడుతున్నాయి. సాధారణంగా దసరా లేదా దీపావళి తర్వాత మొదలయ్యే ఈ పండగ హడావుడి, ఈసారి మాత్రం చాలా ముందుగానే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థియేటర్ల దగ్గర అసలైన యుద్ధం ఎలా ఉండబోతోందోననే క్యూరియాసిటీ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయిపొయింది.
ఈ రేసులో అందరికంటే ముందుగా స్పీడ్ పెంచింది విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల కాంబినేషన్. వీరిద్దరి క్రేజీ ప్రాజెక్ట్ రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాకు ముహూర్తం షాట్ కొట్టకముందే ‘సంక్రాంతి రిలీజ్’ అంటూ మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. ఎంత నమ్మకం ఉంటే ఏకంగా ‘జనవరి 13 విడుదల’ అనే లైన్‌ను టైటిల్‌గా పెట్టే ఆలోచన చేస్తారు? సంక్రాంతికి వెంకీ-అనిల్ రావిపూడిల మార్కు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పక్కా ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఇంత అర్జెంట్‌గా డేట్ లాక్ చేసుకోవడం వెనుక కాస్త టెన్షన్ కూడా కనిపిస్తోంది.
ఇక అసలైన మాస్ జాతర మెగాస్టార్ చిరంజీవి సినిమాతో షురూ కానుంది. బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు చేస్తున్న సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సీజన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని మెగా క్యాంప్ నమ్ముతోంది. రాబోయే పది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రాబోతోంది. పండగ బరిలో మెగాస్టార్ సినిమా ఉంటే ఆ ఊపే వేరు, కాకపోతే ఇతర సినిమాలకు స్క్రీన్ల కొరత తప్పదు.
దీనికి తోడు నందమూరి బాలకృష్ణ తన 111వ సినిమాతో పండగ సెంటిమెంట్‌ను కంటిన్యూ చేయడానికి రెడీ అవుతున్నారు. బాలయ్యకు సంక్రాంతి అంటే హోమ్ గ్రౌండ్ లాంటిది. అటు కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక వందో చిత్రం కూడా ఈ రేసులోనే ఉండేలా కనిపిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ కానుకగా తీసుకురావాలని చూస్తున్నారు, ఒకవేళ అక్కడ మిస్సైతే మాత్రం కచ్చితంగా జనవరి రెండో వారంలో సంక్రాంతి బరిలో దించడం ఖాయంగా కనిపిస్తోంది. సీనియర్ హీరోలంతా ఒకేసారి థియేటర్ల పై దాడి చేస్తే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం, కానీ థియేటర్ల పంపకాల దగ్గర జరిగే రచ్చ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
also read :స్టార్ ప్రొడ్యూసర్ రూ. 1.35 కోట్ల నగలు మాయం.. లగ్జరీ ఫ్యాషన్ జర్నీలో ఊహించని ట్విస్ట్!
మరోవైపు, వైవిధ్యమైన కథలతో వచ్చే యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈసారి పండగ రేసును ముందే గెస్ చేశాడు. గతేడాది పండగ సమయంలోనే, వచ్చే సంక్రాంతికి కూడా నేనొస్తున్నా అంటూ లీక్ ఇచ్చాడు. సీనియర్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో, అనిల్ సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. శ్రీనువైట్లకు ఇది కమ్‌బ్యాక్ సినిమా కావడం, శర్వానంద్ కి సంక్రాంతి సెంటిమెంట్ కలిసి రావడం ప్లస్ పాయింటే అయినా , భారీ పోటీ తట్టుకుని థియేటర్లను దక్కించుకోవడం వీరికి కత్తిమీద సామే.
ఇక టాలీవుడ్ స్టార్స్ ఇలా ప్లాన్ చేస్తుంటే, అటు పరభాషా హీరోలు కూడా తెలుగు సంక్రాంతి మార్కెట్‌పై కన్నేశారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘టాక్సిక్’ ఈ ఏడాది రావడం లేదని, వచ్చే ఏడాది జనవరి 14 లేదా 15న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుందని ఇండస్ట్రీ టాక్. అలాగే తమిళ స్టార్ సూర్య తన 47వ చిత్రాన్ని కూడా ఇదే సీజన్‌లో తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
also read :సమంత నిజంగానే తల్లి కాబోతుందా? ‘మా ఇంటి బంగారం’ ఈవెంట్ పిక్స్ వెనుక మిస్టరీ !
పాన్ ఇండియా రేంజ్ ఉన్న ఇలాంటి పెద్ద సినిమాలు కూడా సంక్రాంతి రేసులోకి వస్తే, లోకల్ సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టమే. ఇన్ని సినిమాలు ఒకే వారంలో రావడం వల్ల ప్రేక్షకులకు బోలెడన్ని ఆప్షన్లు దొరుకుతాయి, పండగ కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉంటాయి అనేది ఒక పాజిటివ్ పాయింట్ అయితే… థియేటర్లు దొరక్క కొన్ని సినిమాలు నష్టపోవడం, అనవసరమైన క్లాషెస్ వల్ల బిజినెస్ దెబ్బతినడం లాంటి నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయ్.చూడాలి ఈ ముందస్తు సంక్రాంతి బజ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులకు తెరలేపుతుందా లేక పంతాలకి పోయి నష్టాలు తెస్తుందో !