2016 ఆగస్టు 12.. యశ్, రాధికా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే అదే రోజు వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇప్పుడు ఆ రోజుకు పదేళ్లు పూర్తయ్యాయి. దీంతో రాధికా పండిట్ అప్పటి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ యశ్ తన జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్‌లలో ఒకడని చెప్పేలా ఓ పోస్ట్ పెట్టింది రాధికా.
ఇందులో రాధికా చెప్పిన ఓ మాట ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. యశ్‌ను ఉద్దేశించి.. “You will always be my favourite YES” అంటూ ఆమె పోస్ట్ చేసింది. అంటే తన జీవితంలో యశ్‌కి చెప్పిన ఆ ‘YES’ ఎప్పటికీ తనకు ఫేవరెట్ అనే అర్థంలో పెట్టిన ఈ క్యాప్షన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
పెద్దగా హడావుడి లేకుండా ఒక చిన్న వీడియోతో పదేళ్ల జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోవడంతో నెటిజన్లు కూడా తెగ షేర్ చేస్తున్నారు.
అయితే యశ్, రాధికా పండిట్ పరిచయం ఇప్పటిది కాదు. ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే టీవీ సీరియల్స్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 2008లో వచ్చిన ‘మొగ్గిన మనసు’ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీళ్ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. తర్వాత కలిసి సినిమాలు చేస్తూ ఇద్దరి మధ్య బంధం మరింత బలపడింది.
2012లో వచ్చిన ‘డ్రామా’ సినిమా కూడా వీళ్ల కెరీర్‌లో ప్రత్యేకమైనదే. ఆ తర్వాత 2014లో వచ్చిన ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’ మాత్రం ఈ జంటకు మరింత గుర్తింపు తెచ్చింది. సినిమాలో వీళ్ల కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, అప్పటికే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపించింది.
అయితే తమ ప్రేమ గురించి మాత్రం యశ్, రాధికా పెద్దగా బయట మాట్లాడలేదు.
చివరికి 2016లో వీళ్ల ప్రేమకు పెద్దల అంగీకారం దొరికింది. అలా ఆగస్టు 12న గోవాలో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 9న బెంగళూరులో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో వీళ్ల పెళ్లి ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇక యశ్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘కేజీఎఫ్’తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇప్పుడు యశ్ చేస్తున్న మరో భారీ సినిమా ‘టాక్సిక్’. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. యశ్ లుక్, సినిమా కాన్సెప్ట్, మేకింగ్ ఇలా ప్రతీ విషయంలోనూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీంతో యశ్‌కు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.
అదే సమయంలో ఇప్పుడు సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కంటే రాధికా షేర్ చేసిన పాత వీడియోనే ఫ్యాన్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల క్రితం ఎంగేజ్‌మెంట్‌లో ఉన్న యశ్, రాధికాను చూసి.. “ఇంత త్వరగా పదేళ్లు గడిచిపోయాయా?” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశేనా? ‘ఫౌజీ’ విషయంలో ట్విస్ట్!
మొత్తానికి యశ్, రాధికల స్నేహం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. 2016లో రాధికా చెప్పిన ఆ ఒక్క ‘YES’కి ఇప్పుడు పదేళ్లు పూర్తయ్యాయి. అందుకే ఆమె షేర్ చేసిన ఈ చిన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంతలా వైరల్ అవుతోంది.