Corporate Employees Medical Bills Financial Stress| భారతదేశంలోని కార్పొరేట్ ఉద్యోగు లకు అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు పెద్ద భూతంలా కనిపిస్తున్నాయి. ఆస్పత్రికి వెళితే ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడి గురించి ఉద్యోగ జీవులు ఆందోళన చెందుతున్నారు. టాటా AIG నిర్వహించిన ఒక అధ్యయనంలో 94 శాతం మంది ఉద్యోగులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనుకోకుండా వచ్చే భారీ ఆసుపత్రి బిల్లులు తమ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి తెస్తాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
తీవ్రమైన అనారోగ్యం లేదా ఎమర్జెన్సీ సమయంలో ఆసుపత్రి చికిత్స ఫ్యామిలీ సేవింగ్స్‌ని వేగంగా తగ్గించేస్తాయి. నెలవారీ జీతంపై ఆధారపడే ఉద్యోగులకు భారీ మొత్తంలో ఎదురయ్యే ఆస్పత్రి బిల్లులు ఎదుర్కోవడం చాలా కష్టం. తప్పుడు జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ, మానసిక ఆరోగ్యం కూడా వారికి ఆందోళనకు కారణాలు అని అధ్యయనంలో తేలింది. బీమా మొత్తం చికిత్స ఖర్చును కవర్ చేయకపోతే ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. పాలసీ పరిమితులు, మినహాయింపులు, ఇతర నిబంధనలు అదనపు ఖర్చులకు కారణం కావచ్చు.
ఉద్యోగం కోల్పోవడం లేదా కొత్త కంపెనీలో చేరడం సమయంలో ఆరోగ్య ఖర్చుల భయం మరింత పెరుగుతుంది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు పది మందిలో ఏడుగురు.. ఆరు నెలల వరకు మాత్రమే ఈ ఖర్చులు భరించగలమన్నారు. కేవలం 12 శాతం మంది మాత్రమే తమ సేవింగ్స్ ఏడాదికిపైగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఉద్యోగం లేని సమయంలో వైద్య అత్యవసరం వస్తే కుటుంబంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఏర్పడవచ్చు. అలాగే ఉద్యోగం మారినప్పుడు కంపెనీ అందించే ఆరోగ్య బీమా మారే అవకాశం ఉంటుంది.
సర్వే ప్రకారం 88 శాతం మంది ఉద్యోగులు.. ఉద్యోగ మార్పు సమయంలో నిరంతర ఆరోగ్య బీమా చాలా ముఖ్యంగా భావించారు. అయితే, కేవలం 40 శాతం మందికి మాత్రమే బీమా కొనసాగింపునకు సంబంధించిన అవకాశాలపై అవగాహన ఉంది. దీంతో ఆరోగ్య రక్షణ అవసరం తెలిసినా.. సరైన సమాచారం చాలామందికి అందడం లేదని తెలుస్తోంది. ఉద్యోగం వదిలే ముందు తమ బీమా పరిస్థితిని ఉద్యోగులు తప్పనిసరిగా పరిశీలించాలి.
కంపెనీ అందించే గ్రూప్ మెడికల్ కవర్ ఉద్యోగులకు ముఖ్యమైన ఆర్థిక రక్షణ అందిస్తుంది. అయితే అత్యవసర ఆసుపత్రి చికిత్సకు అది ఒక్కటే సరిపోదని చాలామంది భావిస్తున్నారు. సర్వేలో దాదాపు 75 శాతం మంది కంపెనీ బీమా పూర్తిస్థాయి రక్షణ ఇవ్వదని చెప్పారు. అందుకే అదనపు వ్యక్తిగత ఆరోగ్య బీమా అవసరమని 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయినా 45 శాతం మందికి కంపెనీ బీమా తప్ప వ్యక్తిగత ఆరోగ్య పాలసీ లేదు. ఈ విషయాలు.. చాలామంది ఉద్యోగులకు తమకు ఎలాంటి పూర్తి స్థాయి బీమా కావాలో అవగాహన లేదని స్పష్టం చేస్తోంది.
Also Read: ఫైవ్ స్టార్ హోటల్ కంటే స్ట్రీట్ ఫుడ్ బెటర్.. ఫుడ్ ఇంజినీర్ చెప్పిన కారణాలివే
కేవలం 41 శాతం మంది మాత్రమే తమ కంపెనీ ఆరోగ్య బీమా ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకున్నామని తెలిపారు. అత్యవసర సమయంలో ఈ అవగాహన లేకపోవడం ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. ఏ చికిత్సలకు కవరేజ్ ఉందో, ఎంత మొత్తం అందుతుందో ముందుగానే తెలుసుకోవాలి. కుటుంబ సభ్యులకు కవరేజ్, పాలసీ పరిమితులు, మినహాయింపులను కూడా పరిశీలించడం అవసరం.
అవగాహన లేకపోవడం, తరువాత తీరికగా కొనుగోలు చేద్దామనే ఆలోచన ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా యువ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదనపు బీమా అవసరం లేదని భావించవచ్చు. అయితే అనారోగ్యం లేదా ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగా చెప్పలేం. అందువల్ల పొదుపులు, పెట్టుబడులతో పాటు ఆరోగ్య బీమాను కూడా ఆర్థిక ప్రణాళికలో భాగంగా చూడాలి. సరైన కవరేజ్‌ను ముందుగానే అర్థం చేసుకోవడం అత్యవసర సమయంలో ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు.
Also Read: ప్రతి నెలా రూ.5000 పెట్టుబడి ప్లాన్ చేస్తున్నారా? FD లేదా SIP ఏది బెస్ట్