Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం ఉదయం బీజాపుర్-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వర్గాలు చెబుతున్నాయి.
మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం రావడంతో బీజాపూర్-దంతెవాడ సరిహద్దులను జల్లెడ పట్టాయి కేంద్ర-రాష్ట్ర బలగాలు. సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. గాలింపు చేపడుతుండగా బలగాలు-మావోల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటలకు మొదలైన కాల్పులు దాదాపు నాలుగైదు గంటలపాటు జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అడవులను గాలిస్తున్నారు. పలువురు మావోలు మృతదేహాలు లభ్యమయ్యాయి. అదే సమయంలో నారాయణపూర్-దంతేవాడ సరిహద్దులోని తుల్తులి ప్రాంతంలో జరిగిన IED పేలుడులో ఒక జవాను మరణించాడు.
గాయపడిన సైనికుడ్ని ఘటనా స్థలం నుండి తరలించారు. నిజానికి, గంగలూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీని ఆధారంగా ఈ ప్రాంతంలో ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టారు. ఒక రోజు ముందే సైనికులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టినట్టు తెలుస్తోంది.
ALSO READ: బూతులు తిడుతోన్న గ్రోక్, ప్రభుత్వం కీలక నిర్ణయం
దాదాపు మావోల అందరి మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. అయితే భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు ఆగినట్టు తెలుస్తోంది. రక్తపు టేరులుగా మారింది ఆండ్రీ అడవుల ప్రాంతం.
ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. వివిధ ప్రాంతాల్లో మావోలు- భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్లలో దాదాపు 85 మంది మావోయిస్టులు హతమయ్యారు. బస్తర్ ప్రాంతంలో దాదాపు 69 మంది ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఘటనలో కీలక నేతలు హతమయ్యారు. అక్కడ తమ ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు మావోలు.
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలుమార్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి బలగాలు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం మావోలకు కోటలాంటింది. ఆ ప్రాంతంలో వారి ప్రాబల్యం బలంగా ఉండేది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు-కేంద్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.