Centre Serious On Grok AI| నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య కూడా తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. ఆ ప్రభావం మనిషి తెచ్చిన సాంకేతికతపై కూడా ఉంటుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన కృత్రిమ మేధ (AI) స్టార్టప్ కంపెనీ సంస్థ ఎక్స్ ఏఐ (xAI) గ్రోక్ ఏఐ చాట్ బాట్ సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ (Grok) హిందీ యాసలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సామాజిక మాధ్యమాల్లో వివాదానికి దారితీసింది. తాజాగా దీని పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. గ్రోక్ వివాదంపై ఎక్స్ ప్రతినిధులతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
అన్ ఫిల్టర్డ్ భాష.. సెన్సార్ లేని అసభ్య పదజాలంతో గ్రోక్ ఏఐ.. యూజర్లకు సమాధానం ఇస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. యూజర్లకు సమాచారాన్ని రెచ్చగొట్టే విధంగా గ్రోక్ ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్ ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని ఎక్స్ అధికారులు కోరినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
వైరల్ అవుతున్న గ్రోక్ పోకిరి భాష వీడియోలు
ఇండియాలో గ్రోక్ పాపులారిటీ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ తో ప్రారంభమైంది. ‘టోకా’ అనే యూజర్ ఈ చాట్ బాట్ ను ‘X’ ప్లాట్ ఫారమ్ లో టాప్ టెన్ బెస్ట్ మ్యూచువల్స్ లిస్ట్ చేయమని అడిగాడు. చాట్ బాట్ త్వరగా రెస్పాండ్ కాలేదు. దీంతో టోకా కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆశ్చర్యకరంగా, గ్రోక్ అదే కఠినమైన స్వరాన్ని ఉపయోగించి హిందీలో తిరిగి సమాధానం ఇచ్చింది.
ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. హైటెక్ ఏఐ లోకల్, అన్ ఫిల్టర్డ్ ఫ్రెండ్ లా ఎలా స్పందించగలదని షాక్ అయ్యారు. దీంతో గ్రోక్ పై చాలా మందికి ఆసక్తి కలిగింది. దీంతో ప్రజలు ఫన్నీగా రాజకీయాలు, క్రికెట్, బాలీవుడ్, మరిన్నింటి గురించి అన్ని రకాల ప్రశ్నలతో గ్రోక్ ను టెస్ట్ చేయడం ప్రారంభించారు. సాధారణంగా చాట్ జీపిటి, మెటా, డీప్ సీక్ లాంటి ఇతర ఏఐ చాట్ బాట్‌లు మర్యాద పూర్వకంగా సమాధానాలు ఇస్తాయి. కానీ గ్రోక్ రెస్పాన్సెస్ మాత్రం నిజంగా, మనుషులు స్పందించినట్లే ఉంటున్నాయి. గ్రోక్ సంభాషణ తీరు చాలా రియల్ గా, దాని పదాలు పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయి.
Also Read: ‘ఆపుతావా నీ ఏడుపు’.. పోకిరి భాష మాట్లాడే ఏఐ.. మస్క్ ఉత్పత్తి మరీ
రిలే గూడ్ సైడ్ అనే మరో ఏఐ రీసెర్చర్ కు కూడా గ్రోక్ తో చాలా చేదు అనుభవం ఎదురైంది. పదే పదే ఆయన గ్రోక్ ఏఐని వాయిస్ మోడ్ లో ప్రశ్నలతో విసిగించారు. దాంతో గ్రోక్ తనకు ఓపిక నశించిందని.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టింది.
హిందీలోనే కాదు తెలుగు యువత అడిగిన ప్రశ్నలకు కూడా గ్రోక్ ఆసక్తికర సమాధానాలు ఇస్తోంది. చాలామంది AIని విద్యా, సమాచార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుండగా.. తెలుగు యువత దానితో మరింత సరదాగా వ్యవహరిస్తోంది. వారు గ్రోక్ కు కొన్నిసార్లు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తూ విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఆశ్చర్యకరంగా గ్రోక్ కూడా అదే శైలిలో స్పందిస్తోంది. వారు ఉపయోగించిన పదాలను తిరిగి ఉపయోగిస్తూ హాస్యభరితమైన సమాధానాలు ఇస్తోంది. గ్రోక్ యొక్క ఈ ప్రతిస్పందనలు తెలుగు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి, వారు మరింత సృజనాత్మకమైన ప్రశ్నలు అడుగుతూ ప్రతిస్పందనలు పొందుతున్నారు. గ్రోక్ యొక్క భాష, పదజాలం చూస్తుంటే, ఇది కేవలం ఒక AI కాదని, ఎవరో మనిషే సమాధానం ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఫ్యాన్ వార్స్ లో సాధారణంగా ఉపయోగించే పదాలను, స్థానిక భాషను గ్రోక్ ఉపయోగించడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.