AAP Former Minister Sourabh Bharadwaj Turns Youtuber | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పరాజయం పాలైంది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు అనేక కీలక నేతలు ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ యూట్యూబర్‌గా మారారు. ఆయన ‘నిరుద్యోగ నేత’ అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భరద్వాజ్, భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి శిఖారాయ్ చేతిలో ఓడిపోయారు. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన ఆయన.. 58 సెకన్ల వీడియోను అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోలో.. “ఎన్నికల ఫలితాలతో నా జీవితం తారుమారైంది. నేను ఇప్పుడు ఒక ‘నిరుద్యోగ నేత’గా మిగిలిపోయాను. ఈ ఫలితాలు నాతో పాటు అనేక నేతలను కూడా నిరుద్యోగులుగా మార్చాయి. ఈ వేదిక ద్వారా.. ఓటమిని ఎదుర్కొన్న తర్వాత రాజకీయ నాయకుడి జీవితంలోని పరిస్థితులను మీతో పంచుకుంటాను. మీరు మీ సూచనలు, సందేశాలు, ప్రశ్నలను నాతో పంచుకోవచ్చు” అని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ కైలాశ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భరద్వాజ్, ఆరోగ్యం, నీరు, గృహ, పరిశ్రమల వంటి వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన.. 3,000 ఓట్ల తేడాతో బిజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత బిజేపీ ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుంది.
70 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగగా.. 48 స్థానాల్లో బిజేపీ గెలుపొందింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 22 సీట్లకే పరిమితమైంది. ఓటమి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోదియా, సత్యేందర్ జైన్.. లాంటి దిగ్గజాలు ఉన్నారు. అయితే ఈ పరాభావం నుంచి ముఖ్యమంత్రి అతిషీ సింగ్ తప్పించుకున్నారు. ఆమె కాల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read: సిబిల్ స్కోర్‌తో పెళ్లి క్యాన్సిల్.. వరుడికి షాకిచ్చిన అత్తమామలు
అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కేజ్రీవాల్, పదేళ్ల పాలనలో అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. మద్యం కేసులో కేజ్రీవాల్ మరియు అతని సహచర మంత్రులు జైలుకు వెళ్లడంతో, ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల విశ్వాసం క్షీణించింది. కోట్లాది రూపాయలతో కేజ్రీవాల్ తన అధికార నివాసానికి మరమ్మత్తులు చేయించుకోవడం కూడా వివాదాలను రేకెత్తించింది.
తాను సామాన్యుడిగా ప్రజల్లో చెప్పుకునే కేజ్రీవల్ భారీ ఖర్చుతో శీష్ మహల్ నిర్మించుకున్నాని బిజేపీ పదే పదే ప్రచారం చేసింది. అవినీతి ఆరోపణలకు తోడు ఢిల్లీలో యమునా నది కాలుష్యం, వాయు కాలుష్యం సమస్యలను ఆప్ పార్టీ పరిష్కరించలేక పోయింది. ఈ కారణాల వల్ల పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ పాలనకు ఢిల్లీ ప్రజలు తెర దించారు.
ప్రస్తుతం బిజేపీ తరపున ముఖ్యమంత్రి పదవిని కేజ్రీవాల్ ను ఎన్నికల్లో ఓడించిన పర్వేశ్ సింగ్ వర్మ చేపట్టనున్నరనే ప్రచారం జరుగోతోంది.